సీఎన్‌ఆర్ రావుకు జపాన్ అత్యున్నత పౌర పురస్కారం
బెంగుళూరు: సైన్స్ రంగంలో చేసిన కృషికి గానూ ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్నసీఎన్‌ఆర్ రావు(చింతామణి నాగేశ రామచంద్రరావు) జపాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండో-జపనీస్ సైన్స్ కోఆపరేషన్కి ఆయన చేసిన సేవలకిగానూ ఈ పురస్కారానికి ఎంపిచేశారు. సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్తగా సీఎన్‌ఆర్ రావుకు మంచి గుర్తింపు ఉంది. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1600 పరిశోధన పత్రాలు, 50 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 70 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
సీఎన్‌ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్‌డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది. భారతరత్నతో పాటు 2013లో సీఎన్‌ఆర్ రావుకు ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో గౌరవ విదేశీ సభ్యుడి హోదా కూడా దక్కింది.