శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాలపై ఉత్తమ సలహాలు, సూచనలు అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంచి సలహాదారు అవసరం ఉందని భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు.
బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాలపై ఉత్తమ సలహాలు, సూచనలు అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంచి సలహాదారు అవసరం ఉందని భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో దూరదృష్టి కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అద్భుత ఆలోచనలతో ముందుకు సాగున్నారని చెప్పారు.
అయితే పాలనా అంశాల్లో శాస్త్ర, సాంకేతికను వినియోగించుకోవడంతో పాటు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై సలహాలు అందించేందుకు ఈ రంగంలో నిపుణులైన సలహాదారు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేదరికం వంటి అనేక సమస్యలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కరించడం సాధ్యమవుతుందని అన్నారు. భారత్‌లో పరిశోధనలకు ప్రాముఖ్యత ఇవ్వడం, పరిశోధనల ఫలాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.