ప్రతీకాత్మక చిత్రం
17 వ శతాబ్దంలో తొలిసారిగా కాఫీ ఘుమఘుమల రుచి మన దేశానికి పరిచయం అయ్యి, ఆ తరువాత ఇక్కడ నిలదొక్కుకుంది. దీంతో మన దేశపు కాఫీని ’’ఇండియన్ మాన్‌సూన్ కాఫీ’’ అని కూడా పిలుస్తారు. ఏదేమైనా కేరళ, కర్ణాటకను ముంచెత్తిన వరద పోటు కాఫీకి కూడా తప్పలేదు. కాఫీ ఉత్పత్తిలో కర్నాటక తొలిస్థానంలో ఉంటే కేరళ ద్వితీయస్థానంలో ఉంది. దేశానికి అవసరమైన కాఫీ ఉత్పత్తికి కీలకమైన రాష్ట్రాలు కర్ణాటక, కేరళ. కర్ణాటకలో 71 శాతం, కేరళలో 21 శాతం కాఫీ ఉత్పత్తి జరుగుతుంది. కేరళ రాష్ట్రంలోని కాఫీ పంటలనూ, కేరళని ఆనుకుని ఉన్న కర్ణాటక కాఫీ ఉత్పత్తి కేంద్రాలైన కొడగు, చిక్మంగుళూరులను ఈ వరద ప్రభావం తీవ్రంగా దెబ్బతీసింది.
వరదలతో ఈ రెండు రాష్ట్రాల్లోని కాఫీ పంటకు కోలుకోలేని దెబ్బపడింది. అయితే కేవలం కాఫీ పంట దెబ్బతినడమే కాకుండా ఏళ్ళతరబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోన్న కాఫీ మొక్కలను సైతం ఈ వరదలు కూకటివేళ్ళతో పెకిలించాయి. కాఫీ తోటలపై విరిగిపడిన కొండచరియలతో పంట సర్వనాశనం అయ్యింది. దీని ప్రభావం దేశంలోని మొత్తం కాఫీ పరిశ్రమపై కూడా ఉండనుంది. కాఫీ తోటల్లో పనిచేస్తోన్న కార్మికుల ఇళ్ళు కూడా ధ్వంసం అయ్యాయనీ కర్ణాటక ప్లాంటర్స్అసోసియేషన్(కెపిఎ) ఛైర్మన్హెచ్.టి.ప్రమోద్తెలిపారు. 2017-18లో మనదేశంలో కాఫీ ఉత్పత్తి 3.16 లక్షల టన్నులు. అయితే ఈ వరదల వల్ల కాఫీ పంటల నష్టం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
కేరళలో కాఫీ పంట...
కేరళ 20.8 శాతం కాఫీ ఉత్పత్తితో దేశంలో రెండవ స్థానంలో ఉంది. కేరళలోని ఈశాన్య ప్రాంతమైన వయ్‌నాడ్ జిల్లాలో కాఫీ ఎక్కువగా పండిస్తారు. అరబికా, రోబస్టా లాంటి కాఫీ పంటల్లో 80 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
ఎంత ఉత్పత్తి?
దేశంలో కాఫీ పంటల పరిధిలో ఉన్న మొత్తం భూభాగంలో 19 శాతం కేరళ రాష్ట్రంలో ఉంది. వయ్‌నాడ్, ట్రావెన్‌కోర్, నెల్లియంపట్టి ప్రాంతాల్లో 85,000 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్స్ఉన్నాయి. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో దేశంలోని మొత్తం కాఫీ పంటలో 25 శాతం ఉత్పత్తి అవుతోంది. దేశంలోని 70 శాతం కాఫీని ఉత్పత్తి చేస్తోన్న కొడగు, చిక్కమంగుళూరు, సక్లేష్పూర్(హస్సన్) జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లొచ్చని భావిస్తున్నారు.
కర్ణాటకలోని మడికేరికి సమీపంలోని ముక్కోడ్లు గ్రామస్తుడైన విశ్రాంత సైనికాధికారి రిటైర్మెంట్అనంతరం కాఫీ ప్లాంటేషన్లోకి అడుగుపెట్టారు. దాదాపు 8 ఏళ్ళ సుదీర్ఘశ్రమ అనంతరం ఇప్పుడిప్పుడే ఆదాయం వస్తోంది. ఇంతలోనే ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పంటంతా మట్టిపాలైంది. ’’కనీసం నా పొలం సరిహద్దులేవో కూడా గుర్తించలేని పరిస్థితి నాకెదురైంది’’ అని సైనికాధికారి కొల్లప్ప వ్యాఖ్యానించారు. ’’కొడగులో దాదాపు 5000 ఎకరాల్లో కాఫీ పంట పూర్తిగా ధ్వంసం అయ్యింది’’ అని కూర్గ్ ప్లాంటర్స్ క్లబ్ నిర్వాహకులు కె.సి.బొప్పన్న తెలిపారు.
కాఫీ ఉత్పత్తుల రవాణాకి సైతం అడ్డంకులు...
కాఫీ ఉత్పత్తులను ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడంలో కూడా రెండు రాష్ట్రాలూ తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రవాణామార్గాలు మూసుకుపోవడంతో కొడగు, మంగుళూరు లేదా కొచ్చికి ఈ ఉత్పత్తులను చేరవేయడం అసాధ్యంగా మారింది. కాఫీ ఉత్పత్తులను రవాణా చేసేందుకు లారీ యాజమాన్యాలు సైతం సంసిద్ధంగా లేవని కర్ణాటక కాఫీ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ రాజన్ తెలిపారు.
ఎంతమందికి ఉపాధి?
కర్ణాటక కొడగు ప్రాంతంలో మొత్తం 2 లక్షల మంది కాఫీ తోటల్లో ఉపాధిపొందుతున్నారు. చిక్మగళూరు లోనే 1.3 లక్షల మంది కాఫీ తోటల్లో పనిచేస్తున్నారు. కేరళలో దాదాపు 44,000 మందికి కాఫీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. వయ్‌నాడ్, ట్రావెన్‌కోర్, నెల్లియంపట్టి ల్లో అత్యధికంగా కాఫీ తోటలున్నాయి. వయ్నాడ్లో 30,000 మంది ఉద్యోగులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ట్రావెన్‌కోర్‌లో 10,000 మంది, నెలియంపట్టిలో 2,669 మంది ఉద్యోగులున్నారు. ఇంత మందికి ఉపాధినిస్తోన్న కాఫీ పరిశ్రమ వరదతాకిడితో అతలాకుతలమైంది. దీనిపైన ఆధారపడి పనిచేస్తోన్న వ్యక్తులూ, వారిపైన ఆధారపడిన వేలాది కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment