చెన్నై : కమలాతాళ్.. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తమిళనాడులోని పెరూర్‌కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే విక్రయిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లినప్పటికీ.. కమలాతాళ్ తన ఇడ్లీల ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు. నష్టాలు వచ్చినప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే వేడి వేడి ఇడ్లీ(ఒక ఇడ్లీ ఒక్క రూపాయి), ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె)
అవ్వకు దాతల సాయం
లాక్‌డౌన్ నేపథ్యంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్‌కు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం ఆమెకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి కలిరాజ్ ఆహార, కిరాణా వస్తు సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భారతీయార్ విశ్వవిద్యాలయ తలుపులు తన కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని కమలాతాళ్ చెప్పారు. హిందూస్తాన్ స్కౌట్స్ మరియు గైడ్స్ సభ్యులు కమలాతాళ్‌కు అవసరమైన వస్తువులను ఇచ్చారు. కోయంబత్తూర్ సెక్టార్ హెడ్ ప్రశాంత్ ఉతమా మాట్లాడుతూ.. ‘కమలాతాళ్ బామ్మ గురించి చాలా సార్లు విన్నాం. ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ ఎలా అందిస్తున్నారో కూడా విన్నాం. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఆమె ఒక్క రూపాయి ఇడ్లీని ఎలా నిర్వహించగల్గుతున్నారో విని ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవకు మా వంతుకు కొంత సహాయం చేశాం’ అని అన్నారు.
రెట్లు పెంచే ఆలోచన లేదు
లాక్‌డౌన్ వల్ల భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ రేట్లు పెంచే ఆలోచన నాకు లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రూపాయికే క్వాలిటీ ఇడ్లీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా మంది ఇడ్లీల కోసం వస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయినా వలస కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను’అని కమలాతాళ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment