చెన్నై: రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదం కోసం విపక్షాలను అభ్యర్థించే పనిలో పడింది. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్, ఇతర పక్షాలు రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. శుక్రవారమిక్కడ మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్రం ఈ బిల్లులను తెచ్చింది. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో సహకరించాలి’ అని కోరారు. కాగా, విమానాశ్రయాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న చెన్నై విమానాశ్రయ సిబ్బంది వెంకయ్యకు నిరసన గళం వినిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం డౌన్.. డౌన్, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు డౌన్..డౌన్ అని నినాదాలు చేశారు.