
సాక్షి, చెన్నై: రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి కోసం రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో సినీ నటి కుష్భు పేరు ప్రథమంగా వినిపిస్తున్నా, తెర మీదకు మరి కొందరు నేతల పేర్లు రావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోననే చర్చ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రస్తుతం నామినేటెడ్ ఎంపీలుగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, సురేష్ గోపి, మేరికోం, రూపా గంగూలీ, నరేంద్ర జాదవ్ తదితర ఆరుగురి పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.
సుబ్రహ్మణ్య స్వామికి ఇది వరకు తమిళనాడు నుంచి నామినేటెడ్ ఎంపీ పదవిని కేటాయించారు. ఈసారి ఆయనకు పదవి మళ్లీ దక్కేది అనుమానంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. దీంతో తమిళనాడు నుంచి ఈ పదవి సినీనటి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బుకు దక్కవచ్చు అనే చర్చ నడుస్తోంది.
పార్టీ కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నా, సరైన గుర్తింపు రావడం లేదని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా మోదీకి మద్దతుగా సంగీత దర్శకుడు ఇలయరాజా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్ర బీజేపీలో సీనియర్లు ఉంటూ, ఎలాంటి పదవులు లేకుండా ఉన్న పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్ కూడా రేసులో ఉండటం గమనార్హం. అయితే, కళా రంగం కేటగిరిలో కుష్భుకు లేదా ఇలయరాజాకు పదవీ గ్యారంటీ అన్న ప్రస్తుతం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment