సాక్షి, చెన్నై: ప్రముఖ సనీ నటి కుష్బూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతూ తమిళనాడు దివ్యాంగుల హక్కుల సంఘం ఆమెపై 50 పోలీసు స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసింది. బుధవారం కుష్భూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన సందర్భంగా ఆమె మీడియాతో సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి నెట్టాయి. కాంగ్రెస్‌కు మేధో వైకల్యం ఏర్పడిందని, ఆ పార్టీ నేతలు మానసిక వికలాంగులంటూ కుష్బూ విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు అసోషియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం మండిపడింది. (చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి)
దీనిపై కుష్బూ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. బాధలో రెండు తప్పుడు పదాలను వాడానని క్షమాపణలు కోరుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థిల్లోనూ తన క్షమాపణలు అంగీకరించేది లేదని దివ్యాంగుల హక్కుల సంఘం స్పష్టం చేసింది. అంతేగాక కుష్బూపై రాజీలేని పోరాటానికి దిగుతామంటు తమిళనాడులోని 50 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సంఘం డిమాండ్ చేస్తోంది. చట్టప్రకారం కుష్బూ చేసిన వ్యాఖ్యలకు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!)
Comments
Please login to add a commentAdd a comment