న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలొచ్చే మార్గాలపై విచారణ చేయడానికి ఒక స్వతంత్ర కమిషన్ ను ఏర్పాటుచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు డిపాజిట్ చేసిన రూ. 500, రూ, 1000 నోట్లపై ఆదాయపు పన్నును ఎందుకు మినహాయించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మధ్య జరిగిన భేటికి ఈ నిర్ణయానికి సంబంధం ఉందన్నారు.
‘బ్యాంకుల్లో రూ. 2, 5 లక్షలు డిపాజిట్ చేసిన సాధారణ ప్రజలు విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు రూ. 2,500 కోట్లు డిపాజిట్ చేసినా దర్యాప్తు జరగడం లేదు. ఇది చాలా తప్పు. అందుకే గత ఐదేళ్లుగా రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న బ్యాంకు అకౌంట్‌ల వివరాలతోపాటు, నిధులొచ్చే మార్గాలపై విచారణ చేయడానికి స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని అన్నారు.