ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల శాంతిభద్రతలు..అధికారుల విభజన..తదితర అంశాలపై చర్చ జరిగిట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎలాంటి సమస్యలు లేవని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నట్లు గవర్నర్ చెప్పారు. అధికారుల విభజన త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించుకోవచ్చని అయితే ఎంసెట్ మాత్రం ఉమ్మడిగా ఉంటుందని చెప్పారు. విద్యార్ధుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడతామని నరసింహన్ అన్నారు. రొటీన్లో భాగంగానే మోదీని కలిసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.