
సాక్షి, న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన దుకాణాల మూసివేత (సీలింగ్ డ్రైవ్)కు వ్యతిరేకంగా వ్యాపారులు ఇచ్చిన బంద్ పిలుపుతో బుధవారం ఢిల్లీలో 2500 మార్కెట్లు మూతపడ్డాయి. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ర్టీస్ (సీటీఐ), అఖిలభారత వ్యాపారుల సంఘాల సమాఖ్య బంద్‌కు పిలుపు ఇచ్చింది. మరోవైపు రాంలీలా మైదాన్‌లో ఢిల్లీ వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, వేలాది చిన్న మధ్యతరహా సంస్థలు మద్దతివ్వడంతో బంద్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీటీఐ కన్వీనర్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ చెప్పారు. నగరంలోని చాందినీ చౌక్, సదర్‌బజార్, జనక్ పురి సహా పలు కీలక ప్రాంతాల్లోని మార్కెట్లు మూతపడ్డాయని తెలిపారు.
ఢిల్లీ అధికారులు చేపట్టిన షాపుల మూసివేతతో 40 లక్షల మంది వ్యాపారులు, వారి కుటుంబాలు వీధినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణాలను సీల్ చేయడాన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లును లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దుందుడుకుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని విడిచిపెట్టిన అధికారులు కేవలం వ్యాపారులపై మాత్రమే విరుచుకుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment