
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో అక్టోబర్ 21న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వట్టియూర్‌కావు, కొన్ని, ఆల్‌రూర్, ఎర్నాకుళం, మంజేశ్వరమ్ స్థానాలలో ఉపఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నాలుగు స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షం యూనియన్ ముస్లిం లీగ్ ఓ స్థానంలో పోటీ చేయనుంది. టీజీ వినోద్, (ఎర్నాకుళం), ఏడీవీ శానిమోల్ ఉస్మాన్, (ఆరూర్), పి.మోహన్ రాజ్‌న్,(కొన్ని) (వట్టియూర్‌కావు) నుంచి కె.మోహన్ కుమార్ బరిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల జాబితాను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
గత వారం కేరళలోని పాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన యూనైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ సాంప్రదాయక ఓటు బ్యాంకును కోల్పోవడం యూడీఎఫ్‌ను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం త్వరలో జరిగే ఉపఎన్నికలపై పడుతుందేమోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏ మేరకు విజయావకాశాలను దెబ్బతీస్తాయోనని పార్టీ నాయకులు మదనపడుతున్నారు.