చరఖా తిప్పితే గాంధీ కాలేరు
‘ఖాదీ’ క్యాలెండర్‌లో మోదీ చిత్రంపై విపక్షాల ఆగ్రహం
• ఖాదీ ఖ్యాతినీ హైజాక్ చేయాలని చూస్తున్నారన్న రాహుల్
• గతంలోనూ గాంధీజీ చిత్రం లేకుండా క్యాలెండర్ వచ్చింది..
• ఇదంతా అనవసర రాద్ధాంతమన్న పీఎంవో
న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ క్యాలెండర్, డైరీపై గాంధీ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను ముద్రించడంపై వివాదం మరింత ముదిరింది. చరఖా తిప్పినంత మాత్రాన ఎవరూ గాంధీ కాలేరు అంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు శుక్రవారం విమర్శల దాడి ప్రారంభించాయి. మంగళయాన్ యాత్ర విజయవంతమైన సమయంలో ఆ ఘనత కోసం వెంపర్లాడిన మోదీ... ప్రస్తుతం ఖాదీ ప్రచారకర్తగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో విమర్శించారు. ‘చరఖాతో పాటు మహాత్ముడి చిత్రం తొలగించి మోదీబాబు ఫొటో పెట్టారు.. జాతిపిత చిత్రాన్నే తొలగిస్తారా.. మోదీగారూ.. ఏంటిది?’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఖాదీ, గాంధీజీ అనే పదాలు దేశ చరిత్ర, స్వావలంబన, పోరాటానికి చిహ్నాలని, క్యాలెండర్ నుంచి గాంధీజీ ఫొటో తొలగించడం మహా పాపమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం... ఇదంతా అనవసర రాద్ధాంతంగా కొట్టిపారేసింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ (కేవీఐసీ) క్యాలెండర్, డైరీలపై మహాత్మా గాంధీ ఫొటో తప్పనిసరనే నిబంధన ఏదీ లేదని, గతంలోనూ గాంధీజీ ఫొటో లేకుండా క్యాలెండర్లు వెలువడ్డాయంటూ సమర్థించుకుంది. 1996, 2002, 2005, 2011, 2012, 2013, 2016 సంవత్సరాల్లో విడుదలైన క్యాలెండర్లలో గాంధీ ఫొటో లేదని పేర్కొంది. మోదీ యువత చిహ్నమని అభివర్ణిస్తూ.. యువతలో ఖాదీ ఉత్పత్తులపై ప్రజాదరణ పెరుగుతుండటం దీనికి నిదర్శనమని చెప్పింది.
ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించేందుకే..
‘ఖాదీ అమ్మకాలు ప్రోత్సహించి నేతన్నల జీవితాల్ని మెరుగుపర్చేందుకే ప్రధాని మోదీ చిత్రాన్ని క్యాలెండర్, డైరీలపై ముద్రించాం. గాంధీజీ స్థానాన్ని మోదీతో భర్తీ చేశారంటున్న వారిని ఒక్కటే ప్రశ్న వేస్తాను. వేరెవరితోనైనా గాంధీజీని పోల్చగలమా? మహాత్ముడి ఖ్యాతి అంత తక్కువా? గాంధీజీ స్థానం ఎన్నటికీ వేరొకరు భర్తీ చేయలేరు. ఇదంతా అనవసర వివాదం’ అంటూ కేవీఐసీ చైర్మన్ వీకే సక్సేనా వివరణ ఇచ్చారు. ఖాదీ పరిశ్రమ మొత్తం గాంధీజీ సిద్ధాంతం, ఆదర్శాలపై ఆధారపడి ఉందని, కేవీఐసీకి ఆయన ఆత్మ. కాబట్టి ఆయనను విస్మరించే ప్రశ్నే లేదన్నారు.
ఫ్యాషన్‌గా మారింది: తుషార్ గాంధీ
గాంధీజీ చరఖా సాధికారతా సాధనమని, అయితే పేరు ప్రఖ్యాతులు పొందేందుకు ప్రస్తుతం అది ఫ్యాషన్ వస్తువుగా మారిపోయిందంటూ మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేద, బలహీనవర్గాలకు బాపూజీ చరఖా ఉత్పత్తి, సాధికారత సాధనం. స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయుధంలా పనిచేసింది. ప్రస్తుతం అది కేవలం ఫొటోలు తీసుకునే పరికరంగా మారిపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు.
గాంధీ సిద్ధాంతాల ప్రచారం: బీజేపీ
కేవీఐసీ క్యాలెండర్‌లపై గాంధీజీ చిత్రాలను అనేకసార్లు ముద్రించలేదని, దీనిపై కాంగ్రెస్ అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని బీజేపీ ఆరోపించింది. మహాత్ముడి సిద్ధాంతాల్ని ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం గాంధీ పేరును, ఫొటోల్ని వాడుకొని ఆయన ఆశయాల్ని, ఆదర్శాల్ని విస్మరించిందని బీజేపీ విమర్శించింది.