
సీఎం పదవి ఇస్తామన్నారు..
సాక్షి, ముంబై: అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, దీంతో తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొంటూ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే సోమవారం తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారాన్ని లేపింది.
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో నారాయణ్ రాణే సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భేటీ అయ్యారు. అనంతరం తన కు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పార్టీపై, పార్టీ నేతృత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి అందచేశారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివసేనను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామని చెప్పారు కాని తొమ్మిదేళ్లైనప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం తన మాట నిలబెట్టుకోలేదన్నారు. తనతోపాటు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదని, అనంతరం తన మద్దతుదారులకు టిక్కెట్ ఇవ్వడంలో కూడా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం పనితీరు నచ్చలేదు...
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మచ్చలేని రాజకీయనాయకుడే అయినప్పటికీ అతడి పనివిధానం మాత్రం సరిగా లేదని నారాయణ రాణే విమర్శించారు. ప్రజల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలుచేయలేకపోయారన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలతోపాటు కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపిం చారు. దీని ప్రభావం ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలపై పడిందని.. ఫలితం ఘోర పరాజయమని ఆయన చవాన్‌పై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పనితీరులో మార్పురాలేదని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు రాణే పేర్కొన్నారు.
అధిష్టానం నిర్ణయం తర్వాతే...
తాను మంత్రి పదవికి చేసిన రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన అనంతరమే భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయం ప్రకటించనున్నట్టు నారాయణ్ రాణే చెప్పారు. తాను పార్టీలో తిరుగుబాటు చేయలేదని, కేవలం తన అభిప్రాయాలను వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా పార్టీ, ప్రభుత్వం గురించి నారాయణ్ రాణే ఏమనుకుంటున్నారన్నది ప్రధానం కాదని, ప్రజలేమనుకుంటున్నారన్నది ముఖ్యమన్నారు.
సోనియాతో సీఎం చర్చలు...
రాజీనామా అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చిస్తానని సీఎం పృథ్వీరాజ్‌చవాన్ చెప్పారని రాణే తెలిపారు. చర్చల అనంతరం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని, ఇది జరిగిన తర్వాత మరోసారి తాను ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశాలున్నాయన్నారు.
రాణే పయనం ఎటువైపో...
నారాయణ రాణే పార్టీని వీడినట్టయితే ఆయన పయనం ఎటువైపు వెళ్లనుందనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. శివసేనను వీడి తొమ్మిదేళ్ల కిందట నారాయణ్ రాణే కాంగ్రెస్‌లో ప్రవేశించారు. అప్పటినుంచి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, రాణేల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఘాటైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాణేకు శివసేన గేట్లు మూసుకుపోయినట్లే. మరోవైపు ఎన్సీపీలోకి కూడా వెళ్లే అవకాశాలు పెద్దగా కన్పించడంలేదు.
దీంతో ఆయనకు కేవలం బీజేపీ, ఎమ్మెన్నెస్ పార్టీలే ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. బీజేపీలో చేరే అవకాశాలున్నప్పటికీ మిత్రపక్షమైన శివసేన దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. అయితే శివసేనను కాదని రాణేను పార్టీలో చేర్చుకుని ఎమ్మెన్నెస్‌తో బీజేపీ జతకట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజ్ ఠాక్రేతో ఉన్న సత్సంబంధాల కారణంగా రాణే ఎమ్మెన్నెస్‌లో చేరే అవకాశాలను కూడా రాజకీయ నిపుణులు కాదనలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెన్నెస్ నాయకులు రాణే పార్టీలో చేరితే స్వాగతిస్తామని ప్రకటించారు.
ఇలాంటి తరుణంలో రాణే మరో ప్రత్యామ్నాయంపై ఆలోచన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన కుమారుడు స్థాపిం చిన స్వాభిమాని సంఘటనను రాజకీయ పార్టీగా మార్చి దాని ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దిగేందుకు అవకాశాలున్నాయి. ఇలా కొంకణ్, ముంబైతోపాటు పట్టున్న ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 సీట్లకుపైగా గెలుచుకుని ఒక బలమైన శక్తిగా అవతరించేందుకు రాణే వర్గీయులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.