
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం తరువాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలి తెలిపారు. గతంలో ప్రకటించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: Shiv Sena-Narayan Rane: రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం
ఇటీవలే కేంద్ర కేబినెట్‌లోకి చేరిన రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్‌లో ముగియాల్సి ఉంది. అయితే, సోమవారం రాయ్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. ఆయనపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆయనకు మహాడ్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చదవండి : నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె