చండీగఢ్: లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి పేదలు అల్లాడుతుంటే.. కొంతమంది నాయకులు మాత్రం ఈ కష్టకాలంలోనూ రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రజల ఇబ్బందులతో తమకు పనిలేదన్నట్లుగా రాజకీయ లబ్దికోసం వెంపర్లాడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం పంజాబ్‌లోని భాటిండా స్టేషన్ నుంచి వలస కార్మికులతో ప్రత్యేక రైలు బిహార్‌కు బయల్దేరేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కరపత్రాలు పంచిపెట్టడం ప్రారంభించారు. ‘‘మీ రైల్వే టిక్కెట్లకు సోనియా గాంధీ డబ్బు చెల్లించారు’’ అంటూ వారికి పాంప్లెంట్లు అందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీ ప్రయాణ చార్జీలు చెల్లించారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సునిల్ జఖార్ మిమ్మల్ని పంపిస్తున్నారు. ఈ పాంప్లెంట్‌లో అంతా రాసి ఉంది. ప్రయాణంలో మీకు తీరిక ఉన్నపుడు చదవండి’’ అని రాజా వారింగ్ వలస కార్మికులతో పేర్కొన్నారు. (ప్రత్యేక రైళ్లు: తాజా మార్గదర్శకాలు)
కాగా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు విషయంలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా చేసిన ప్రకటన చేశారు. అదే విధంగా పీఎం–కేర్స్ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్ చేసింది. విపక్షం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార బీజేపీ.. వలస కార్మికుల టికెట్ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని స్పష్టం చేసింది. రైల్వే శాఖ సైతం ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని హితవు పలికింది. ప్రస్తుతం రాజా వారింగ్ చర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(అమాంతం పెరిగిన కరోనా కేసులు.. వారి వల్లే)
Comments
Please login to add a commentAdd a comment