
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన 27,865 మంది వలస కార్మికులు, కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించినట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వలస కార్మికులు వారి స్వరాష్టాలకు వెళ్లడానికి అయ్యే రైలు ప్రయాణ ఖర్చులను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మహారాష్ట్రలోని పలు జిల్లాలో పేరు నమోదుచేసుకున్న 27,865 మంది వలస కార్మికులకు రైలు టికెట్ చార్జీలను చెల్లించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!)
అదే విధంగా రాష్ట్రం ఇంధన శాఖ మంత్రి నితిన్‌రౌత్ ఆధ్వర్యంలో వలస కార్మికులను తరలించే నాలుగు ప్రత్యేక రైళ్లకు టికెట్ చార్జీలు చెల్లించినట్లు పీసీసీ ప్రకటించింది. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి విజయ్ వాడేటివార్, మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రయాణ రుసుములు చెల్లించారని తెలిపింది. సతారా, అహ్మద్‌నగర్, పుణే నాగ్‌పూర్, చంద్రపూర్, కొల్హాపూర్, సాంగ్లి ప్రాంతాలకు వెళ్లే 3,567మంది వలస కార్మికులను ప్రైవేటు వాహనాల్లో తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని పేర్కొంది.
ప్రయాణ సమయంలో కార్మికులకు కావాల్సిన ఆహారం, మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశామని తెలిపింది. సుమారు 24,000 మందికి వలస కార్మికులు కాంగ్రెస్ పార్టీ అందించిన ప్రయాణ ఖర్చుల సాయంతో బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చేరుకున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పేర్కొంది. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి కేంద్రం శ్రామిక్ రైళ్లను నడపడానికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. (ఏ రాష్ట్రంలోనూ వారిని అడ్డుకోవద్దు: కేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment