కలవరం: కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో మోదీ డైలాగ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అనూహ్య దృశ్యాలు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్రమోదీ తరుచు ఉపయోగించే మాట ప్రధాన మాటగా కనిపించింది. పలు రాజకీయ వేదికలపై ప్రధాని మోదీ ‘మిత్రోన్’ (స్నేహితులారా) అనే మాట ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ డెహ్రాడూన్, హరిద్వార్‌వంటి తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో నినాదంగా పెట్టి అవాక్కయ్యేలా చేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారాన్ని చేతబట్టి కాంగ్రెస్ రికార్డు సృష్టించాలని భావిస్తుండగా.. మోదీ మ్యాజిక్‌తో ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలతో ఆశాభావంతో ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికలకు మార్చి 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. మిత్రోం అనే పదంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగిత తదితర అంశాలను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల వద్దకు నినాదాల రూపంలో తీసుకెళుతోంది.