'తెలంగాణ అంశంలో యూపీఏ దారుణ వైఫల్యం'
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో చోటు చేసుకున్న సంఘటనలకు పూర్తిగా కాంగ్రెస్ బాధ్యత వహించాలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. తన పార్టీకి సంబంధించిన సభ్యులపై కాంగ్రెస్ పార్టీ నియంత్రణ కోల్పోయింది అని ఆయన విమర్శించారు. గురువారం చోటు చేసుకున్న సంఘటనలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగించేవని ఆయన వ్యాఖ్యానించారు. సభ్యులపై నియంత్రణ లేకుండా.. ఎలాంటి హోంవర్క్ చేయకపోవడమే పార్లమెంట్ లో నేడు చోటు చేసుకున్న సంఘటనలకు కారణమని ఆయన ఆరోపించారు.
సమావేశాలకు నిషేధిత వస్తువులను తీసుకురావొద్దనే నిబంధనను ఉల్లంఘించడం దారణం అని ఆయన అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించిన సంఘటనగా జైట్లీ అభివర్ణించారు. పార్లమెంట్ లో సంఘటనల ద్వారా తెలంగాణ అంశంలో యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అని చెప్పవచ్చు అని ఆయన అన్నారు. సరియైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదని తప్పంతా కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు.