కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న బీజేపీ కన్నడ నేలపై విజయం సాధించడం ద్వారా దక్షిణాదిన పాగా వెయ్యాలని తహతహలాడుతుంటే, అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక సై్థర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది.
మరి ఓటర్ల నాడి ఎలా ఉంది ? సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు ? గత అయిదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేరుస్తాయా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,244 మందితో మాట్లాడారు. 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య ఈ సర్వేని నిర్వహించారు.
ఏయే సంక్షేమ పథకంపై ప్రజలు ఏమంటున్నారు?
సంక్షేమం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది దివంగత నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితలే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వారిని స్ఫురణకు తెచ్చేలా గత అయిదేళ్లలో భాగ్య పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమమే ఓట్లు రాలే అంశంగా మారితే కనుక కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రారంభించిన అన్నభాగ్య పథకానికి ఈ సర్వేలో అనూహ్య స్పందన వచ్చింది. దారిద్య్రరేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యాన్ని ఇచ్చే ఈ పథకం అద్భుతమైనదంటూ 79 శాతం మంది కితాబు ఇచ్చారు. మరో 14 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తే, 6శాతం మంది ఆ పథకాన్ని వినియోగించలేదని వెల్లడించారు.
స్కూలు డ్రాపవుట్లను తగ్గించడం కోసం అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లను ఇచ్చే సైకిల్ భాగ్య పథకంపట్ల 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 2006 నుంచి అమల్లో ఉన్న ఈ పథకాన్ని ఇప్పటికీ సిద్దరామయ్య ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాన నీటిని సంరక్షించి సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడుల్ని పెంచే కృషి భాగ్య పథకంపై 58 శాతం రైతులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇక 25 శాతం మంది పెదవి విరిచారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించే అనిల్ భాగ్య పథకంపై కూడా ప్రశంసల వర్షం కురిసింది. ఏకంగా 66శాతం మంది ఈ పథకాన్ని భేష్ అన్నారు. వెనుకబడిన మైనార్టీ వర్గాలకు చెందిన నవ దంపతులకు 50 వేలరూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే షాదీ భాగ్య పథకంపై కూడా 45 శాతం మంది సంతృప్తి ప్రకటించారు.
తమిళనాడులో అమ్మ కేంటిన్ల స్ఫూర్తితో గత ఏడాది ఆగస్టులో ఇందిర కేంటీన్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సబ్సిడీ రేట్లకే సామాన్యుడి కడుపు నింపే ఈ పథకం ఆశించినంతగా ప్రజాదరణ పొందలేదని ఈ సర్వేలో తేలింది. 36 శాతం మంది ఈ కేంటీన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే 31 శాతం మంది ఈ కేంటీన్లు వచ్చాక సంతృప్తిగా భోజనం చేస్తున్నామని చెప్పారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత నెలలో 2వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఆరోగ్య భాగ్య పథకం ఈ సర్వే పరిధిలో లేకపోయినా దానికి కూడా మొదట్లోనే మంచి స్పందన కనిపిస్తోంది.
కర్ణాటకలో సంక్షేమ పథకాలు
ఆరోగ్య భాగ్య
అన్నభాగ్య
కృషి భాగ్య
సైకిల్ భాగ్య
అనిల్ భాగ్య
షాదీ భాగ్య
క్షీర భాగ్య
వసతి భాగ్య
ఇందిరా కేంటీన్లు
10కి 7 మార్కులు
ఈ సర్వేలో సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు 10కి 7 మార్కులు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అత్యధికులు వివిధ రంగాల్లో సిద్దరామయ్య ప్రభుత్వానికి మంచి మార్కులే వేశారు.
పాఠశాలల నిర్వహణ (7.85), విద్యుత్ సరఫరా (7.83), ప్రజా రవాణా (7.61), అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువులపంపిణీ (7.35), ఉద్యోగ అవSకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో సిద్దరామయ్య ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. మొత్తంగా సిద్దరామయ్య భాగ్యాన్ని ఈ భాగ్య పథకాలే నిర్ణయిస్తాయా ? ఇంకో నెల వేచి చూడాల్సిందే మరి.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment