మారాలంటే మాకు 2.5 లక్షలు కావాలి!
న్యూఢిల్లీ: తమ వాహనాలను సీఎన్జీ ట్యాక్సీలుగా మార్చుకోవడానికి కనీసం రూ.2.5 లక్షల మేరకు ఖర్చవుతుందని ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రోడ్లపై పెట్రోల్, డీజిల్ క్యాబ్లను అనుమతించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం క్యాబ్ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ క్యాబ్స్ రోడ్లపై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు రోడ్లపై వాహనాలను అడ్డుకుంటు నిరసన తెలుపుతున్నప్పటికీ సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు క్యాబ్స్ కంపెనీలు, డ్రైవర్లు మాత్రం తమ గోడును చెప్పుకుంటున్నారు.
క్యాబ్స్ ను సీఎన్జీ రూపంలోకి మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు సలహా ఇచ్చిన మాట నిజమే. ఆ ప్రాసెస్ కోసం ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. కానీ, డీజిల్, పెట్రోల్ క్యాబ్స్ ను సీఎన్జీ వాహనాలుగా మార్చే టెక్నాలజీ మన దేశంలో అందుబాటులో లేదని మొత్తుకుంటున్నారు. టాక్సీ డ్రైవర్ల కోరిక మేరకు నిబందనల్లో కాస్త సడలింపు జరగాలని, దశల వారీగా ఈ నిషేధం విధించాలంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతారని ఆప్ ప్రభుత్వం విన్నవించింది.
పెట్రోలు, డీజిల్ వాహనాల కంటే కూడా సీఎన్ జీ క్యాబ్స్ నుంచి తక్కువ కాలుష్యం వస్తుందని సుప్రీం మళ్లీ చెబుతోంది. ఢిల్లీలో 30,000 నుంచి 40,000 వేల వరకు పెట్రోల్, డీజిల్ ఇంధనంతో నడిచే ఉబెర్, ఓలా క్యాబ్స్ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. నేడు(మే 5న) ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పుపైనే టాక్సీ డ్రైవర్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ల నిరసనతో గత మూడు రోజులుగా నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.