సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండడంతో అనియత రంగంలో పనిచేస్తోన్న కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాద పరిస్థితి పొంచి ఉంది. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా 70వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆ సొమ్ము ఏమాత్రం సరిపోదు. ప్రస్తుత ప్యాకేజీని కూడా పక్కా ప్రణాళికతో అమలు చేయక పోయినట్లయితే ఆశించిన ఫలితాలు అందే అవకాశం లేదు. (రుణ గ్రహీతలకు భారీ ఊరట)
2015–16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ఎంప్లాయ్‌మెంట్–అన్‌ఎంప్లాయ్‌మెంట్ సర్వే’ ప్రకారం దేశంలో 80 శాతం మంది అనియత రంగంలో పని చేస్తున్నారు. వారిలో మూడోవంత మంది దినసరి వేతన జీవులే ఉన్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో వారందరిని ఆదుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ చిత్త శుద్ధితో అమలు చేయడంతోపాటు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. (బ్రేక్ 'కరోనా')
1. వద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఏప్రిల్ నెలలోనే మూడు నెలల పింఛను ఇవ్వాలి. సామాజిక భద్రతా పింఛన్లను నెలకు 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాలి.
2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2019–20 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలి. ఈ పథకం కింద కార్మికులకు నెలకు పది రోజుల చొప్పున మూడు నెలలపాటు, అంటే నెలకు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలను చెల్లించాలి. ఈ పథకం దేశంలో ఉన్న 14 కోట్ల కార్డుదారులకు సొమ్ము చెల్లించాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. (ప్యాకేజీ లాభాలు)
3. జాతీయ ఆహార పథకం కింద, ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి దేశంలో మూడింట రెండొంతుల మంది వస్తున్నారు. రేషన్ కార్డుల మంజూరులోనూ కొన్ని లోపాలు, పొరపాట్లు ఉన్నప్పటికీ వారందరికి బయోమెట్రిక్ గుర్తింపు అవసరం లేకుండా బియ్యం, గోధుమలు, పప్పులు ముందస్తుగా మూడు నెలలకు సరిపడా పంపిణీ చేయాలి. భారత ఆహార సంస్థ వద్ద భారీ నిల్వలు ఉన్నందున ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు.
4. ప్రజా పంపిణీ వ్యవస్థ కిందనే బడుగువర్గాల ప్రజలకు సబ్బులు, నూనెలు కూడా సరఫరా చేయాలి.
5. అంగన్‌వాడీలు, పాఠశాలలు మూసివేసినందున పిల్లలకు పౌష్టికాహారం సరఫరాలో భగంగా కేరళ రాష్ట్రం తరహాలో ఇళ్లకే గుడ్లు, కర్జూరం ప్యాకెట్లు ఉచితంగా సరఫరా చేయాలి.
6. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ పథకం, ప్రజా పంపిణీ పథకం కిందకు రాని లక్షలాది మంది వలసకార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా పనులు ఉండవు కనుక వారికి ఉపాధి ఉండదు. అలాంటి వారు తమ తమ ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణించి పలు రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన విషయం తెల్సిందే. వలసకార్మికులందరికి స్టేడియంలలో, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేసి, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలి. ఆహార పంపిణీ కింద సరఫరా చేసే రేషన్ సరకులను కూడా ఈ కిచెన్లకు సరఫరా చేయాలి.
ఇలా అనియత రంగంలో పనిచేసే కార్మికులు, దినసరివేతన జీవులను ఆదుకున్నప్పుడే సంపూర్ణ లాక్‌డౌన్ అర్థవంతంగా విజయవంతం అవుతుంది. లేకపోయినట్లయితే కరోనా వైరస్ బారిన పడి మరణించే వారికన్నా ఆకలితో అలమటించి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment