న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) భారత్‌లోనూ ఆందోళనలు రెకెత్తిస్తోంది. ఇప్పటివరకు 28 మందికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది హోలీ వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు బుధవారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిపుణులు సూచనల ప్రకారం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రధాని మోదీ బాటలోనే నడవనున్నట్టు ప్రకటించారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో తాము కూడా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని అమిత్ షా, నడ్డాలు తెలిపారు.(చదవండి : ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో ఎలాంటి మార్పు లేదు: సీపీ)
అమిత్ షా స్పందిస్తూ.. బహిరంగ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మన భారతీయులకు హోలీ అతి ముఖ్యమైన పండగ. కానీ కరోనా ఆందోళనల నేపథ్యంలో నేను హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు అప్రమత్తతో ఉండాలి. మీ గురించి, మీ కుటుంబం గురించి జాగ్రత్తలు తీసుకోండి’ అని షా ట్వీట్ చేశారు.
హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నడ్డా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో పోరాడతున్నాయి. వివిధ దేశాలు, వైద్యులు సంయుక్తంగా కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదు. అలాగే హోలీ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అందరు సురక్షితంగా ఉండండి’ అని నడ్డా ట్విటర్‌లో పేర్కొన్నారు. (చదవండి : దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి)
అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా..
మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. మార్చి 15న హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణాసాగర్ రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా బహిరంగ సభలు నిర్వహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment