సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న రోగుల్లో స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారికి నయమైతే, ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు డిశ్చార్జి విధానాలను సవరిస్తూ శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. బాధితుల రోగ తీవ్రత ఆధారంగా వారిని 3 రకాలుగా వర్గీకరించింది. స్వల్పకాలిక, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలున్నవారిగా విభజించింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలుండి వరుసగా మూడ్రోజులపాటు జ్వరం లేకుంటే పరీక్షలు చేయకుండానే రోగిని డిశ్చార్జి చేయొచ్చని సూచించింది.
(చదవండి: గుజరాత్ హాట్‌స్పాట్)
అలా కాకుండా తీవ్ర లక్షణాలు, ఇతరత్రా అనారోగ్యం ఉంటే వారికి చికిత్స చేసి చివరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశాకే డిశ్చార్జి చేయాలని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతూ 4–5 రోజులు వరుసగా లక్షణాలు కనిపించని రోగులకు కూడా కరోనా పరీక్షలు చేసి డిశ్చార్జి చేస్తున్నారు. చివరి 24గంటల్లో 2 సార్లు పరీక్షలు నిర్వహించి రెండింట్లోనూ నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. కేవలం సీరియస్‌గా ఉన్న రోగులు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే ముందు వారికి పరీక్షలు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఇంట్లో ఐసోలేషన్ తప్పనిసరి...
స్వల్ప లక్షణాలుండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని డిశ్చార్జి చేయడానికి మూడు రోజుల ముందు మందులు వాడకపోయినా జ్వరం ఉండకూడదు. ఆక్సిజన్ లెవల్స్ సరిపడా ఉండాలి. ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకోగలగాలి. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకుండానే డిశ్చార్జి చేస్తారు. అంతేకాదు అప్పటికే ఆ వ్యక్తికి లక్షణాలు మొదలై 10 రోజులు పూర్తి అయి ఉండాలి.
డిశ్చార్జి తర్వాత ఏడు రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఇంట్లో ఎవరినీ ముట్టు కోకూడదు. ఎవరితో నేరుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఇంటికి వెళ్లాక ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే తక్కువైతే ఆ వ్యక్తిని తక్షణమే కరోనా ఆసుపత్రికి తరలించాలి. ఒకవేళ డిశ్చార్జి తర్వాత రోగిలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవ డంలో ఇబ్బంది ఎదురైతే హెల్ప్‌లైన్ల ద్వారా సంప్రదించాలి. 14వ రోజున ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని టెలికాన్ఫరెన్స్‌లో వైద్య సిబ్బంది ఆరా తీస్తారు.
ఇక మధ్యస్థ లక్షణాలున్న వారిని కూడా పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేస్తారు. వారు ఆక్సిజన్‌పై ఉండి చికిత్స పొందుతారు. ఆ తర్వాత 10 రోజులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే వారిని కూడా నేరుగా పరీక్ష చేయకుండానే డిశ్చార్జి చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తిని చివరి మూడు రోజుల్లోఆక్సిజన్‌పైనే ఉంచాల్సి వస్తే పూర్తిగా నయం అయ్యాక పరిశీలించి డిశ్చార్జి చేస్తారు. అయితే చివరి మూడు రోజులు జ్వరం వంటివి లేనప్పుడు పరీక్ష చేయకుండానే ఇంటికి పంపిస్తారు. ఆ వ్యక్తి కూడా ఇంట్లో ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి.
(చదవండి: కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు..)
అత్యంత సీరియస్ కేసుల విషయంలో...
రోగ నిరోధకశక్తి లేని హెచ్‌ఐవీ రోగులు, అవయవ మార్పిడి బాధితులు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల వంటి హైరిస్క్ వారి విషయంలో డిశ్చార్జి ప్రమాణాలు వారు కోలుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. వారిని డిశ్చార్జి చేసేప్పుడు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాకే ఇంటికి పంపిస్తారు. తాజా మార్గదర్శకాల వల్ల అనేక కేసులకు డిశ్చార్జి సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. చాలా కేసులు సీరియస్‌గా ఉండటంలేదు.
కాబట్టి దీనివల్ల వైద్య సిబ్బందికి అనవసర శ్రమ, కిట్లు, పరీక్షల ఖర్చు తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. అయితే కేంద్రం నిర్ణయంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డిశ్చార్జి సమయంలో పరీక్షలు చేయకుండా ఇంటికి పంపిస్తే ఒకవేళ ఆ వ్యక్తికి తర్వాత పరిస్థితి తీవ్రమైతే మిగిలిన కుటుంబ సభ్యులకు అంటుకుంటుందని అంటున్నారు. అయితే కేంద్రం ఇప్పటివరకు నమోదైన కేసులను అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment