సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో శనివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 43 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది. ఇక వైరస్ బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెల్త్‌బులిటిన్ విడుదల చేశారు. దేశంలో 22 జిల్లాల్లో 2వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. దేశంలో 73 శాతం కరోనా మరణాలు 60 ఏళ్లు పైబడినవారివే అని వెల్లడించారు.
అలాగే దేశంలో కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణాలు రేటు కేవలం 3.3 శాతమని లవ్ అగర్వాల్ తెలిపారు. వయసుల వారిగా మరణాల రేటును ఆయన వెల్లడించారు. 0-45 ఏళ్ల మధ్య ఉన్న వారు 14.4 శాతం, 45-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 10.3 శాతం, 60-75 ఏళ్ల మధ్య ఉన్న వారు 33.1 శాతం, 75 ఏళ్లకు పైబడిన వారు 42.2 శాతం మరణిస్తున్నారని అగర్వాల్ చెప్పారు. వైరస్ సంక్రమణ రేటు 83 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.
కరోనా కట్టడికి ఏపీ కఠిన చర్యలు..
మరోవైపు వైరస్ అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోందని చెప్పారు. దీనిలో భాగంగానే బ్లడ్ శాంపిల్స్ సేకరణకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామనన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారు వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడొద్దని లవ్ అగర్వాల్ సూచించారు. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు స్థానిక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు.
మర్కజ్ కేసులు.. 4,291
ఇక దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనాల గురించి లవ్ అగర్వాల్ పలు వివరాలను వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో 4,291 కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్‌కు సంబంధించినవే అని స్పష్టం చేశారు. అత్యధికంగా తమిళనాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం కేసులు, తెలంగాణలో 79 శాతం, యూపీలో 59 శాతం ఏపీలో 50 శాతం కేసులు మర్కజ్‌కు లింక్ ఉన్నవే అని తెలిపారు. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో కూడా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment