న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయట! ఎందుకంటే అక్కడ కాలుష్యం అధికం కాబట్టి. కాలుష్య సూచి ‘పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5’కు ఎక్కువగా గురయ్యేవారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్, వారణాసి, లక్నో, సూరత్ తదితర 16 పెద్ద నగరాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అధికం కావడంతో పీఎం 2.5 ఉద్గారాలు భారీస్థాయిలో వెలువడుతున్నాయని, కరోనా వ్యాప్తికి ఇవి కూడా కారణమని అధ్యయనం స్పష్టం చేసింది.
కాలుష్యం మనిషిలో రోగ నిరోధక శక్తిని హరిస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్కళ్ యూనివర్సిటీ–భువనేశ్వర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ–పుణే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా, ఐఐటీ–భువనేశ్వర్‌కు చెందిన పరిశోధకులు çకలిసి దేశవ్యాప్తంగా 721 జిల్లాల్లో అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 5 వరకూ ఆయా నగరాల్లో కాలుష్య ఉద్గారాలు, గాలి నాణ్యత, కోవిడ్–19 పాజిటివ్ కేసులు, మరణాల సమాచారాన్ని క్రోడీకరించారు. పీఎం 2.5 ఉద్గారాలకు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పునకు, తద్వారా మరణాలకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లలో వంట, ఇతర అవసరాల కోసం జీవ ఇంధనాలను మండించడం కూడా ఉద్గారాలకు కారణమవుతోందని తెలిపారు.
మరో 46,617 పాజిటివ్ కేసులు: దేశంలో 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59,384 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.01%కి పెరిగింది. అదే సమయంలో ఒక్క రోజులో 843 మరో మంది మరణించడంతో మొత్తం మరణాలు 4,00,312కు పెరిగాయి. అలాగే, యాక్టివ్ కేసులు మరింత తగ్గి 5,09,637కు చేరాయి.
6 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు: కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గకపోవడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఆయా రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి చొప్పున నిపుణులు ఉంటారంది. ఈ బృందాలు కరోనా నియంత్రణ చర్యల అమల్లో సహకరిస్తాయని తెలిపింది.
రెండో వేవ్ ముగిసిపోలేదు
దేశంలో కరోనా ఆంక్షలు తొలగించడం, లాక్‌డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా, కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కరోనా నియంత్రణ చర్యలు కొనసాగించాలని, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పుడే అస్త్రసన్యాసం చేస్తే కరోనా వ్యాప్తికి మళ్లీ జీవం పోసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో జూన్ 23 నుంచి 29 దాకా వారం రోజులపాటు కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే నమోదయ్యిందని గుర్తుచేశారు. కరోనా వ్యాక్సినేషన్‌లో వేగం పెంచినట్లు తెలిపారు.
గర్భిణులూ కోవిడ్ టీకాకు అర్హులే
దేశంలో గర్భవతులు కూడా ఇకపై కోవిడ్ టీకా తీసుకోవచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భవతులను కూడా టీకాకు అర్హులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. గర్భిణులు ఇకపై కోవిన్ యాప్‌లో నమోదు చేసుకుని లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ టీకా వేయించుకోవచ్చని వివరించింది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment