![Coronavirus: Family Keep Body In Ice Cream Freezer For 2 Days In Kolkata - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/2/body_0.jpg.webp?itok=PlDnQeIt)
కోల్‌కతా: కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఎదురుగా ఉంచుకుని ఓ కుటుంబం రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే కరోనా పరీక్ష చేసుకున్న తర్వాతే చికిత్స చేస్తామని పంపించివేశారు. దీంతో ఇంటికి తిరిగి వచ్చేయగా అతడు కొద్ది గంటల్లోనే మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని మార్చురీకి తీసుకువెళ్లగా డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు అతనికి కోవిడ్ ఉందా? లేదా? అనే విషయం తెలిసేంతవరకు మరణ ధృవీకరణ పత్రం ఇవ్వలేమని వైద్యులు తిరస్కరించారు. (టీబీ అండ్ కరోనా)
ఎలాగైనా దహన సంస్కారాలు జరిపించడంటూ అతని కుటుంబ సభ్యులు ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం శూన్యమైంది. మరోవైపు శవం వాసన వస్తుండటంతో మంగళవారం ఉదయం అతని కుటుంబసభ్యులు ఐస్‌క్రీం ఫ్రీజర్ కొని మృతదేహాన్ని అందులో పెట్టి ఉంచారు. అదేరోజు సాయంత్రం అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైద్యాధికారులకు తెలియజేయగా కనీస స్పందన కరువైంది. దీంతో ఆ రోజు కూడా శవంతోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరాఖరికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు నివాసానికి చేరుకుని మృతదేహాన్ని తీసుకువెళ్లారు. సుమారు 50 గంటల తర్వాత ఆ కుటుంబం ఉంటున్న భవనాన్ని శానిటైజ్ చేశారు. (చలో పల్లె‘టూరు’)
Comments
Please login to add a commentAdd a comment