ఇండోర్: కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక వారిపై దాడికి తెగబడ్డ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన గురువారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోవిడ్-19 (కరోనా వైరస్) రోగులతో సన్నిహితంగా మెదిలిన వారిని పరీక్షించే నిమిత్తం వైద్య బందాలు ఇండోర్‌లోని తటపట్టి బఖల్ ప్రాంతానికి చేరుకున్నాయి. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు వైద్యులను కించపరుస్తూ మాట్లాడటమే కాక వారిపై ఉమ్మివేస్తూ రాళ్లదాడి చేశారు. దీంతో వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ దాడిలో మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి స్థానికులు బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. (వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి)
దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మెహరించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా పేర్కొన్నారు. ఇక దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షం కావడంతో ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైద్యసిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మనీశ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. కాగా గతంలోనూ ఇండోర్‌లోని రానిపుర ప్రాంతవాసులకు ఆరోగ్య పరీక్షలు చేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. (తబ్లిగ్ జమాత్: ఆడియో విడుదల)
Comments
Please login to add a commentAdd a comment