ముంబై: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలోనే సగానికిపైగా ఉన్నాయి. ఇక్కడి ముంబై కరోనా పీడితులకు ఆలవాలంగా నిలుస్తోంది. ఈ మహా నగరంలో సుమారు 0.22 శాతం జనాభా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వాణిజ్య నగరం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులతో ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ప్రపంచ పటంలోకి ఎక్కనుంది. ప్రస్తుతానికైతే ఆ స్థానం రష్యా రాజధాని మాస్కో పేరు మీద ఉంది. కానీ అక్కడ కేసులు తగ్గుముఖం పట్టగా ముంబైలో మాత్రం అందుకు విరుద్ధంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మే 22న ఒక్కరోజే ముంబైలో 1751 కేసులు వెలుగు చూశాయి. (మహారాష్ట్రలో ఆగని కరోనా కల్లోలం)
మాస్కో(రష్యా) మినహా మరే ఇతర నగరాల్లోనూ ఒకేరోజు ఇంత మొత్తంలో కేసులు నమోదవలేదు. ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే ముంబై ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న నగరాల్లో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకేట్లు కనిపిస్తోంది. మే నెల ప్రారంభంలో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నెల రెండో వారం ముగిసేసరికి కోవిడ్-19తో అతలాకుతలమవుతున్న న్యూయార్క్ నగరాన్ని దాటేసింది. కానీ న్యూయార్క్ జనాభా ముంబైలో మూడు వంతులు మాత్రమే ఉంటుంది. మాస్కో, సావో పౌలో(బ్రెజిల్) జనాభా పరంగా ముంబైతో సమానంగా సరితూగుతాయి. ఇక మరణాల పరంగా మాత్రం ముంబై మెరుగైన స్థానంలోనే ఉంది. కోవిడ్ కారణంగా ముంబైలో 909 మంది మరణించగా, సావో పౌలోలో 678, మాస్కోలో 1867 మంది చనిపోయారు.(రికార్డు స్థాయిలో కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment