సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చుమీరుతున్న వేళ ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ మరో 3 నెలల్లో దేశంలో అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు తయారీ, మార్కెటింగ్‌లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారం భించామని, అన్ని పరీక్షలు ఆగస్టులో విజయవంతంగా పూర్తయ్యే నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం సెప్టెంబ ర్‌కల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
తొలిదశ ట్రయల్స్ సక్సెస్
వాస్తవానికి కోవిడ్–19 వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో 12 సంస్థల పరిశోధనలను డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఇలా డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు పొందిన వాటిలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఒకటి. ఈ వర్సిటీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ‘ఏజెడ్‌డీ 1222 జేఏబీ’ అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 18–55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకర వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఇప్పుడు మరో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా త్వరలోనే పరీక్షలు నిర్వహించేందుకు వివిధ వయసులకు చెందిన 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేయవచ్చని అంచనా వేస్తోంది.
బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం...
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్‌తోపాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ సంస్థ... మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రాజెనెకా అంచనా ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డోసులు, 2021 జూన్ నాటికి 200 కోట్ల డోసుల ‘ఏజెడ్‌డీ 1222 జెఏబీ’ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
లాభం చూసుకోవట్లేదు...
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా లాభం చూసుకోకూడదు. మేము కూడా ఈ విషయంలో లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాం. అదే కొనసాగిస్తాం కూడా. ప్రయోగ ఫలితాలు విజయవంతంగా పూర్తయ్యే సమయానికి వ్యాక్సిన్ మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసి ఉంచుతాం. ఆగస్టుకల్లా అన్ని ప్రయోగాలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
– పాస్కల్ సారియట్, ఆస్ట్రాజెనెకా సీఈవో
Comments
Please login to add a commentAdd a comment