కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? | Coronavirus: What is Plasma Therapy In Telugu | Sakshi
Sakshi News home page

కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?

Published Sat, Apr 25 2020 2:18 PM | Last Updated on Sat, Apr 25 2020 2:34 PM

Coronavirus: What is Plasma Therapy In Telugu - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారీ చికిత్సకు ఇంతవరకు మందునుగానీ, వ్యాక్సిన్‌నుగానీ కనుక్కోలేక పోవడంతో కరోనా బాధితులను రక్షించేందుకు చైనా, అమెరికా దేశాలు ‘ప్లాస్మా థెరపి’ని ఇప్పటికే ఉపయోగిస్తుండగా, ఇప్పుడు భారత్‌ కూడా అదే థెరపిని ఉపయోగిస్తోంది. ఈ థెరపి వల్ల నలుగురు కరోనా పేషంట్లు పూర్తిగా కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ శనివారం మధ్యాహ్నం తెలిపారు. ఇంతకు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటీ?

దీన్ని ‘కన్వాల్‌సెంట్‌ ప్లాస్మా థెరపి’ అంటారు. ప్రస్తుత సందర్భంలో కరోనా వైరస్‌ వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తంలోని యాంటీ బాడీస్‌ను తీసి అదే వైరస్‌ బారిన పడిన బాధితుడి రక్తంలోకి ఎక్కించడమే ఈ థెరపి. యాంటీ బాడీస్‌ను శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘ఇమ్యునోగ్లోబులిన్‌’గా వ్యవహరిస్తారు. మన పరిభాషలో దీన్ని రోగ నిరోధక శక్తిగా పేర్కొంటాం. ఎవరైన కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లయితే అతని రక్తంలో యాంటీ బాడీస్‌ ఎక్కువగా ఉన్నట్లు. ఈ యాంటీ బాడీస్‌ మనిషి రక్తంలోని ‘ప్లాస్మా’ అనే ద్రావకంలో ఉంటాయి. దాత రక్తం నుంచి  ప్లాస్మాను తీసుకొని రోగికి ఎక్కిస్తారు. అందుకే దీన్ని ప్లాస్మా థెరపి అని అంటారు. రోగి రక్తంలోకి ఎక్కించిన ప్లాస్మాలోని యాంటీ బాడీస్‌ శరీరంలోని కణజాలం మొత్తానికి రక్తం ద్వారా ప్రవహిస్తూ వైరస్‌తో పోరాడుతుంది. ఈ థెరపి వల్ల రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోపాటు అపాయాలు కూడా ఉన్నాయి. 

అపాయాలు ఏమిటీ?
1. రక్తదాతకు హెపిటైటీస్‌ బీ, హెపిటైటిస్‌ సీ, హెఐవీ లాంటి జబ్బులున్నా, మరే ఇతర వైరస్‌లున్నా థెరపి తీసుకున్న రోగులకు సంక్రమిస్తాయి.
2. రక్త దాత నుంచి తీసుకున్న ప్లాస్మాలో వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో యాంటీ బాడీస్‌ ఉండాలి. అలా లేని పక్షంలో  ప్లాస్మా థెరపి తీసుకున్న వ్యక్తికి జబ్బు తగ్గకపోగా మరింత తీవ్రమవుతుంది. అప్పటికి తగ్గిపోయినా మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. 
3. ఈ థెరపి వల్ల రోగిలో సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి నశిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే జబ్బులను ఎదుర్కోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. 

అయినప్పటికీ మందు లేని వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ థెరపిని ఉపయోగిస్తున్నారు. 
1. హెచ్‌1ఎన్‌1 (ఇన్‌ఫ్లూయెంజా లేదా స్పానిష్‌ వైరస్‌) ఇన్‌ఫెక్షన్‌ నివారణకు 2009లో ఈ థెరపిని కొన్ని దేశాలు ఉపయోగించాయి. ఇదే వైరస్‌ నివారణకు 1918లో ప్రయోగాత్మకంగా ఈ థెరపిని ఉపయోగించారట.
2. మొట్టమొదటి సారిగా ఈ థెరపీనీ 2014లో ఎబోలా వైరస్‌ వ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. 
3. మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) జబ్బుకు కూడా 2015లో ప్లాస్మా థెరపీని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. 
4. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా వ్యవహరించే స్పానిష్‌ వైరస్‌ నివారణకు 2018లో అనుమతించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement