ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి... | Corporate Companies Giving Pink Slips | Sakshi
Sakshi News home page

అంతటా ఉద్యోగుల కోత

Published Sat, Jan 18 2020 6:46 PM | Last Updated on Sat, Jan 18 2020 6:49 PM

Corporate Companies Giving Pink Slips - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవడంతో పలు స్టార్టప్‌ కంపెనీలు మూతపడుతుండగా, మరోవైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి. వాటిల్లో ‘శ్యామ్‌సంగ్‌ ఇండియా’ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీల నుంచి ‘పేటీఎం’ లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ఉండడం గమనార్హం. 

వాల్‌మార్ట్‌ ఇండియా: రిటేల్‌ దిగ్గజ సంస్థ గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌కు చెందినవారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. 

శ్యామ్‌సంగ్‌ ఇండియా: ఇటీవల ఈ  కంపెనీ పలు విభాగాలను కలిపేసి 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు వార్తలొచ్చాయి. యాజమాన్యం ఒత్తిడికి తగ్గి కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజీవ్‌జిత్‌ సింగ్, బిజినెస్‌ హెడ్‌ సుఖేశ్‌ జైన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను అనుగుణంగా ఎప్పటికప్పుడు సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ సుదీర్ఘకాలం పాటు పోటీలో నిలబడాలంటే ఇలాంటి తప్పవని యాజమాన్యం తెలిపింది. 

ఓయో: ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 2,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ వార్తలు తెలియజేస్తున్నాయి. బిజినెస్‌ అంచనాలకు తగ్గట్టుగా ఒకరు చేసిన పనినే మరొకరు చేసే డూప్లికేట్‌ పద్ధతిని తొలగించి, పని సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇలాంటి చర్యలు అనివార్యం అవుతున్నట్లు కంపెనీ సీఈవో రితేష్‌ అగర్వాల్, ఉద్యోగులనుద్దేశించి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. 

కాగ్నిజెంట్‌: అమెరికా కేంద్రంగా భారత్‌లో పనిచేస్తున్న ఈ సంస్థ నుంచి 350 మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ‘ది ఎకనామిక్‌ టైమ్స్‌’ తెలియజేసింది. ఏడాదికి 80 లక్షల నుంచి 1.2 కోట్ల రూపాయల ప్యాకేజీ అందుకునే ఉద్యోగులే ఎక్కువ మంది బాధితులవుతారని తెల్సింది. వాస్తవానికి ఈ కంపెనీ గత నవంబర్‌ నెలలోనే ఖర్చు నియంత్రణలో భాగంగా రానున్న కొన్ని నెలల్లో  ఏడువేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. 

ఓలా: అద్దెకు క్యాబ్‌లను నడిపే ఓలా సంస్థ గత నెలలోనే 500 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు, అందుకు భారత ఆర్థిక మాంద్యమే కారణమని ‘ఎన్‌ట్రాకర్‌ వెబ్‌సైట్‌’ వెల్లడించింది. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా రానున్న నెలల్లో మరి కొంత మందిని తీసేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వద్ద 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో ఐదు నుంచి ఏడు శాతం మందినే తొలగించనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. 

పేటీఎం: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ గత నెలలో 500 మంది మధ్య, జూనియర్‌ స్థాయి ఉద్యోగులను వెళ్లిపోవాల్సిందిగా పేటీఎం యాజమాన్యం కోరినట్లు ‘ఎన్‌ట్రాకర్‌’ తెలియజేసింది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరును మెరగుపర్చడంలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 

క్వికర్‌: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పలు సేవల సంస్థ గత డిసెంబర్‌ నెలలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ‘ఐఏఎన్‌ఎస్‌’ వార్తా సంస్థ వెల్లడించింది. కార్మిక శక్తి హేతుబద్ధీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యం ఈ కోతలు కార్మికులకు కడుపుకోత కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement