Pink Slip
-
ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు..లేఆఫ్స్ స్పీడు పెంచిన టెక్ కంపెనీలు!
ప్రపంచ దేశాల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. జనవరి ప్రారంభం నుంచి నిన్న మొన్నటి వరకు 85 టెక్ కంపెనీలు 20 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. లేఆఫ్స్.ఎఫ్ఐ నివేదిక ప్రకారం గత ఏడాది మార్చిలో టెక్ కంపెనీలు అత్యధికంగా 38 వేల మందికి ఉద్వాసన పలికాయి. ఆ తర్వాత మళ్లీ ఈ జనవరిలో తొలగింపులు అత్యధికంగా ఉండటం విశేషం. అయితే, రానున్న రోజుల్లో టెక్నాలజీ కంపెనీలు మరింత మందిపై వేటు వేసే అవకాశం ఉందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. టెక్నాలజీ సంస్థ శాప్ ఈ వారం 8,000 మంది, మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1,900 మంది, ఫిన్‌టెక్ స్టార్టప్ బ్రెక్స్ 20 శాతం సిబ్బందిని, ఈబే 1,000 మంది, సేల్స్ ఫోర్స్ సుమారు 700 మందిని ఇంటికి సాగనంపింది. దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సిబ్బందిని 5-7 శాతం తగ్గించే పనిలో పడగా.. జొమాటోకు చెందిన క్యూర్‌ఫిట్ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 120 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. స్విగ్గీ తన ఐపీఓకు ముందే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేయనుంది. ఈ నెల ప్రారంభంలో గ్లోబల్‌గా గూగుల్‌లో పనిచేస్తున్న వందల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. అమెజాన్ తన ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్, ట్విచ్, ఆడిబుల్ విభాగాలలో వందలాది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు. యూనిటీ తన సిబ్బందిలో 25శాతం మందిని, గేమర్లు ఉపయోగించే ప్రసిద్ధ మెసేజింగ్ సేవను అందించే డిస్కార్డ్ తన ఉద్యోగులలో 17శాతం మందిని ఫైర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగుల తొలగింపులు రానన్ను రోజుల్లో భారీగా ఉంటాయని సమాచారం. టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఏఐని వినియోగిస్తున్నాయని, ఫలితంగా వర్క్ ఫోర్స్ మరింత తగ్గించుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.. -
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
లింక్డిన్నూ తాకిన లేఆఫ్‌ల సెగ.. 700 మంది ఉద్యోగుల తొలగింపు!
ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్కు లేఆఫ్స్ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను షట్‌డౌన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లింక్డిన్ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ కొనసాగిస్తుంది. లింక్డిన్ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? ఆరు నెలల్లో 2,70,000 మంది తొలగింపు గత ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది కోల్పోయారు. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. కాగా, 2016లో లింక్డిన్ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన విసయం తెలిసిందే మైక్రోసాఫ్ట్ సైతం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. వారిలో సప్లయి చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని తొలగించింది. జనవరి 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? -
ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి...
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవడంతో పలు స్టార్టప్ కంపెనీలు మూతపడుతుండగా, మరోవైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి. వాటిల్లో ‘శ్యామ్‌సంగ్ ఇండియా’ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీల నుంచి ‘పేటీఎం’ లాంటి డిజటల్ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్ నెట్వర్కింగ్ కంపెనీ ‘ఓయో’ వరకు ఉండడం గమనార్హం. వాల్‌మార్ట్ ఇండియా: రిటేల్ దిగ్గజ సంస్థ గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్మెంట్ క్యాడర్‌కు చెందినవారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. శ్యామ్‌సంగ్ ఇండియా: ఇటీవల ఈ కంపెనీ పలు విభాగాలను కలిపేసి 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు వార్తలొచ్చాయి. యాజమాన్యం ఒత్తిడికి తగ్గి కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్, బిజినెస్ హెడ్ సుఖేశ్ జైన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను అనుగుణంగా ఎప్పటికప్పుడు సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ సుదీర్ఘకాలం పాటు పోటీలో నిలబడాలంటే ఇలాంటి తప్పవని యాజమాన్యం తెలిపింది. ఓయో: ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 2,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎన్ఎన్ వార్తలు తెలియజేస్తున్నాయి. బిజినెస్ అంచనాలకు తగ్గట్టుగా ఒకరు చేసిన పనినే మరొకరు చేసే డూప్లికేట్ పద్ధతిని తొలగించి, పని సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇలాంటి చర్యలు అనివార్యం అవుతున్నట్లు కంపెనీ సీఈవో రితేష్ అగర్వాల్, ఉద్యోగులనుద్దేశించి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్: అమెరికా కేంద్రంగా భారత్‌లో పనిచేస్తున్న ఈ సంస్థ నుంచి 350 మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ‘ది ఎకనామిక్ టైమ్స్’ తెలియజేసింది. ఏడాదికి 80 లక్షల నుంచి 1.2 కోట్ల రూపాయల ప్యాకేజీ అందుకునే ఉద్యోగులే ఎక్కువ మంది బాధితులవుతారని తెల్సింది. వాస్తవానికి ఈ కంపెనీ గత నవంబర్ నెలలోనే ఖర్చు నియంత్రణలో భాగంగా రానున్న కొన్ని నెలల్లో ఏడువేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. ఓలా: అద్దెకు క్యాబ్‌లను నడిపే ఓలా సంస్థ గత నెలలోనే 500 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు, అందుకు భారత ఆర్థిక మాంద్యమే కారణమని ‘ఎన్‌ట్రాకర్ వెబ్సైట్’ వెల్లడించింది. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా రానున్న నెలల్లో మరి కొంత మందిని తీసేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వద్ద 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో ఐదు నుంచి ఏడు శాతం మందినే తొలగించనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. పేటీఎం: డిజిటల్ చెల్లింపుల సంస్థ గత నెలలో 500 మంది మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగులను వెళ్లిపోవాల్సిందిగా పేటీఎం యాజమాన్యం కోరినట్లు ‘ఎన్‌ట్రాకర్’ తెలియజేసింది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరును మెరగుపర్చడంలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. క్వికర్: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పలు సేవల సంస్థ గత డిసెంబర్ నెలలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ‘ఐఏఎన్ఎస్’ వార్తా సంస్థ వెల్లడించింది. కార్మిక శక్తి హేతుబద్ధీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యం ఈ కోతలు కార్మికులకు కడుపుకోత కానున్నాయి. -
'ఐటీ' కి ఏమైంది ..?
♦ ఉద్యోగుల తొలగింపులు పెరుగుతాయా... ♦ మూడేళ్లలో నాలుగో వంతుకు ఉద్వాసన! ♦ ప్రధాన కారణం కంపెనీల ఆటోమేషన్ ప్రక్రియే ♦ ట్రంప్– మాంద్యం వంటి కారణాలూ తోడు ♦ మధ్య స్థాయి వారు, సీనియర్లకే తొలి ముప్పు ♦ సర్వీసులపై ఆధారపడ్డ కంపెనీల్లోనే కోతలెక్కువ ♦ సీనియర్లకు ఈ ఏడాది ఇంకా జీతాలు పెంచని టీసీఎస్ ♦ దేశంలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 45 లక్షలు ♦ ఈ ఏడాది 2–4 శాతం మందిని తొలగించే అవకాశం ♦ ఆటోమేషన్తో తగ్గుతున్న కొత్త నియామకాలు ♦ రెవెన్యూ వృద్ధి శాతంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి సగమే రోజుకో ఐటీ కంపెనీ... ఈ ఏడాది తాము ఎందరు ఉద్యోగుల్ని తొలగించవచ్చో సూచనప్రాయంగా చెబుతోంది. రోజుకో కన్సల్టెన్సీ... ఈ ఏడాది భారత ఐటీ రంగంలో ఎందరి ఉద్యోగాలు పోవచ్చో అంచనా వేస్తూ నివేదికలిస్తోంది. ఇదేమీ అవాస్తవం కాదని నిరూపిస్తూ... ఉద్యోగాలు పోయిన కొందరు కార్మిక శాఖ అధికారుల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకిలా..? కొన్నేళ్లుగా దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించేదిగా పేరు తెచ్చుకున్న ఐటీ సర్వీసుల రంగానికి ఎందుకీ పరిస్థితి? కొందరేమో అమెరికాలో ట్రంప్ గెలవటమేనంటున్నారు!!. మరికొందరు ఆటోమేషన్ పెరిగింది కనుక ఉద్యోగాలు పోతున్నాయని చెబుతున్నారు!!. ఇంకొందరు ఐటీ రంగంలో మాంద్యం మొదలైందనటానికి ఇవన్నీ సంకేతాలంటున్నారు!!. వీటిలో ఏది నిజం? చెప్పాలంటే ఇవన్నీ నిజాలే!! వీటన్నిటికీ తోడు ఐటీ విషయంలో మనం అనుసరిస్తున్న విధానాలూ ఒక కారణమే. ఈ పరిస్థితి ఇండియాకు మాత్రమే పరిమితం కావటం లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులపైనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా 25 లక్షల మంది వరకూ ఉన్న తెలుగువారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిపై వివరణాత్మక కథనాలివి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శివకుమార్ పదిహేనేళ్ల కిందట ఓ ఐటీ దిగ్గజ కంపెనీలో చేరాడు. ఆరేళ్ల తరవాత టీమ్ లీడర్‌గా... మరో ఆరేళ్ల తరవాత మేనేజరుగా పదోన్నతి పొందాడు. మూడేళ్ల కిందట వైస్ ప్రెసిడెంట్ హోదా పొందాడు. జీతం ఏడాదికి రూ.42 లక్షలపైనే. ఈ మధ్యే కంపెనీ అతన్ని పనితీరు మదింపు ఆధారంగా తొలగిస్తున్నట్లు చెప్పింది. తననే కాదు!!. తన టీమ్‌లో ఉన్న కొందరు మేనేజర్లనూ తొలగించింది. రెండేళ్లకోసారి చేపట్టే పనితీరు మదింపులో వారు చాలా దిగువ స్థాయిలో ఉన్నారని, అందుకే వారికి ‘పింక్ స్లిప్’లు అందజేశామని యాజమాన్యం పేర్కొంది. చిత్రమేంటంటే వీరితో పాటు ఆ కంపెనీలో గతేడాది ఎంట్రీలెవల్లో ఉద్యోగాల్లో చేరిన మరికొందరికి కూడా పింక్ స్లిప్‌లు అందాయి. అది కూడా ‘పనితీరు’ ఆధారంగానే జరిగిందట!! నిజం చెప్పొద్దూ!! 154 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగంలో ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు పోవొచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట. అదొక్కటే కాకపోయినా... దీనికి ప్రధాన కారణం మాత్రం ఆటోమేషన్ అనే చెప్పాలి. ఆటోమేషన్ కారణంగా కంపెనీల ఆదాయం పెరిగినట్లుగా ఉద్యోగాలు పెరగటం లేదు. గతంలో 10 శాతం ఆదాయం వృద్ధి చెందితే అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనా ఉండేది. ఆటోమేషన్ కారణంగా ఇపుడది సగానికి పడిపోయింది. కోతలు మున్ముందు మరింత తీవ్రమై... వచ్చే మూడేళ్లలో ఏకంగా 4వ వంతు ఐటీ ఉద్యోగాలు పోతాయనేది నిపుణుల ఆందోళన. అంటే... ప్రస్తుత 45 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 11 లక్షల మంది ప్రభావితమవుతారన్న మాట.తొలగింపులకు సంబంధించి కంపెనీలన్నీ ‘పనితీరు’ అనే ఒకేమాట చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు దీంతో విభేదిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 35–50 ఏళ్ల మధ్యవారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ‘‘కంపెనీలు వయసు మీరినవారిని కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. వారి బదులు యువతను తక్కువ జీతాలకు తీసుకుని... నచ్చిన విధంగా శిక్షణ ఇవ్వొచ్చన్నది వాటి ఆలోచన’’ అని ఐటీ కంపెనీలకు మ్యాన్‌పవర్‌ను అందించే కన్సల్టింగ్ సంస్థకు చెందిన అనిల్ చెప్పారు. ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వారిని తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతాలకొచ్చేవారికి పదోన్నతులిచ్చి కూర్చోబెట్టడమే కంపెనీల ఎజెండాగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతా ‘స్వచ్ఛందంగానే’...! నిజానికిపుడు లే–ఆఫ్లపై ఆందోళనలు పెరుగుతుండటంతో పలు కంపెనీలు ఉద్యోగుల్ని ‘స్వచ్ఛందంగా’ తొలగిస్తున్నాయి. ‘‘ఉద్యోగాల్లో చేరేటపుడే వారి నుంచి తాము వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్లుగా లేఖ రాయించి కొన్ని కంపెనీలు తీసుకుంటాయి. దానిపై ఉద్యోగి సంతకం కూడా ఉంటుంది. అవసరమైనపుడు కంపెనీలు దాన్ని వాడుకుంటాయి. ఇది చాలా ఐటీ కంపెనీల్లో జరిగేదే’’ అని టాప్ ఐటీ సంస్థలో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. మరికొన్ని సంస్థలు సవాలక్ష న్యాయపరమైన నిబంధనలు పెట్టి ఆ పత్రంపై కూడా చేరేటపుడు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. ఒకవేళ తొలగించినా... దాన్లో ఏదో కారణాన్ని చూపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ ఏడాది టీసీఎస్‌లో ఏడేళ్ల వరకూ అనుభవం ఉన్నవారికి మాత్రమే వేతనాలు పెంచారు. అంతకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారికి పెంచలేదు. దానిపై కంపెనీ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇన్ఫోసిస్‌లో అయితే విశాల్ సిక్కా పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఐదేళ్ల పాటు సీనియర్లకు పెంపు ఊసే లేదు. సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇచ్చారు. ‘‘సీనియర్లకు వేతన పెంపు ఉంటుందో లేదో ఇంకా తెలీదు. మాకు ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ తెరవెనక ఏదో జరుగుతోందని మాత్రం అనిపిస్తోంది. ఏదీ పారదర్శకంగా జరగటం లేదు. ఒక్కటి మాత్రం నిజం! ఇకపై ఐటీ కంపెనీల్లో ఏటా మునుపటిలా వేతన పెంపు ఉండాలంటే కుదరకపోవచ్చు’’ అని టీసీఎస్ సీనియర్ ఉద్యోగి ఒకరు వాపోయారు. తీసివేతలు సహజం... స్మార్ట్ఫోన్ల రాకతో డిజిటల్ రంగం ఊపుమీద ఉంది. ఇ–గవర్నెన్స్‌కు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఆటోమేషన్తో అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరుగుతోంది. యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌కు కంపెనీలతోపాటు వినియోగదారులూ సై అంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనకే తయారీ, సేవల కంపెనీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇక్కడ నిపుణులున్నారు కాబట్టే కంపెనీలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఐటీ కంపెనీలకు మంచి భవిష్యత్ ఉందనడంలో ఎటువంటి అనుమానం లేదు. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. మందగమనం లేదు. ఉద్యోగుల నియామకాలు, తీసివేతలు సహజం. ప్రతిభ ఉంటేనే కంపెనీలు ఉద్యోగులను కొనసాగిస్తాయి. మేం తొమ్మిది నెలల్లో 2 లక్షల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. భారత్‌లో ఐటీ రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తోంది. కానీ చైనాలా భారత్‌లోనూ ఐటీయేతర రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇతర రంగాల్లో భారీ పెట్టుబడులు రావాలి. ట్రంప్ ప్రభావం భారత ఐటీ రంగంపై అతిస్వల్పం. 2017–18 కాలానికి క్యాంపస్ నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2018–19కి సెప్టెంబరు నుంచి రిక్రూట్మెంట్ మొదలుపెడతాం. ఐటీ పరిశ్రమలో 2017లో వేతనాలు 5 శాతం పెరుగుతాయనే అంచనాలున్నాయి. – వి.రాజన్న, వైస్ ప్రెసిడెంట్, టీసీఎస్ ఈ ఏడాది 2–4% కోతలు? కంపెనీలు ఏటా 1–1.5 శాతం ఉద్యోగులకు గుడ్‌బై చెప్పడం సహజం. ఈ సారి ఇది 2 నుంచి 4 శాతం ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పటికే టెక్ మహీంద్రా సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించింది. పనితీరు మెరుగ్గా లేని ఉద్యోగుల్ని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తొలగించామని కంపెనీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 2016 డిసెంబరు 31 నాటికి ఈ కంపెనీలో 1,17,095 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో విప్రో 500 మందికి విప్రో గుడ్‌బై చెప్పింది. పనితీరు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ తన సిబ్బందికి కొత్త అంశాల్లో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కూడా చేపట్టింది. మరో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ 10,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు సమాచారం. సంస్థకు మొత్తం 2.7 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 70 శాతం దాకా భారత్‌లో ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నియామకాలు, తీసివేతలు నిరంతర ప్రక్రియ అన్నారాయన. ‘‘దాదాపు నాలుగు నెలలుగా బెంచ్‌పై ఉన్నవారికి... ఎక్కువకాలం బిల్లింగ్‌లో లేనివారికి... బిల్లింగ్‌లో ఉన్నా కూడా ఏటా నిర్వహించే నైపుణ్య పరీక్షలో పాస్ కానివారికి హెచ్ఆర్ నుంచి పిలుపులొస్తున్నాయి. రెండు నెలల జీతం ఇచ్చి తొలగించే పద్ధతి మా కంపెనీలో ఉంది. ఆ కోవలోనే చాలామందికి పింక్ స్లిప్‌లు అందుతున్నాయి’’ అని కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఈ సంస్థలు పనితీరు ఆధారంగా దాదాపు 15,000 మంది ఉద్యోగులకు అతి తక్కువ రేటింగ్ లభించిందని, వీరిపై వేటు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ఓ 1,000 మందిపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన జాబితాలో 3,000 మంది సీనియర్లను ఇన్ఫీ చేర్చింది. 10,000 మందికి ఉద్వాసన పలికేందుకు డీఎక్స్‌టీ టెక్నాలజీస్ సిద్ధమైనట్టు సమాచారం. సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,70,000 ఉంది. సగం కార్యాలయాలు మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా నైపుణ్యం ఉన్న ఉద్యోగి భవిష్యత్‌కు ఎటువంటి ముప్పులేదని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ అధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
పింక్ స్లిప్పై కన్నెర్ర
* ఐటీ కంపెనీకి రూ.12.5 లక్షల జరిమానా * ఆ మొత్తాన్ని బాధిత ఉద్యోగికి అందజేయాలని సర్కార్ ఆదేశాలు * రాష్ట్రంలో ఇదే మొదటిసారి సాక్షి,బెంగళూరు : ‘పింక్‌స్లిప్’పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చూపించకుండా ఉద్యోగినిని విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీకి జరిమానా విధించింది. ఇలాంటి కేసు రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఐటీ, బీటీ కంపెనీల్లో పింక్ స్లిప్ అన్నది సాధారణం. ఉద్యోగికి ఒక నెల జీతం ఇచ్చి విధులకు రాకుండా ఉండమని చెప్పడాన్నే ఐటీ ఇండస్ట్రీ పరిభాషలో ‘పింక్ స్లిప్’ అని అంటారు. అయితే కొన్ని కంపెనీల్లోని ఉన్నతోద్యోగులు ‘తమ మాట వినడంలేదు’ అనే నెపంతో తరుచుగా కింది స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తుంటారు. ఈ విషయంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ‘పింక్ స్లిప్’ విధానానికి అడ్డుకట్టవేయడానికి నూతన చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇక ఏ కంపెనీ అయినా ఓ ఉద్యోగికి పింక్ స్లిప్ ఇస్తే అందుకు గల కారణాలను రాష్ట్ర కార్మిక శాఖకు తప్పక తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాక పింక్ స్లిప్‌కు గురైన ఉద్యోగి కంపెనీ నిర్ణయాన్ని కార్మికశాఖ వద్ద సవాలు చేయవచ్చు. అకారణంగానే కంపెనీ ఉద్యోగిని తొలగించినట్లు కార్మికశాఖ పరిశీలనలో తేలితే సదరు సంస్థ బాధిత ఉద్యోగికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విజయం.. అమెరికా కేంద్రంగా ఐటీ కంపెనీ నడుపుతున్న సంస్థకు బెంగళూరులోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో ఓ శాఖ ఉంది. ఢిల్లీకి చెందిన లక్ష్మి (పేరు మార్చాం) 2012 జూలైలో టెక్నికల్ సిస్టం అనలిస్ట్‌గా ఈ సంస్థలో ఉద్యోగంలో చేరారు. మూడు నెలల ప్రొబేషనరీ కాలం తర్వాత ఆమెను ఉద్యోగిగా గుర్తిస్తూ సదరు సంస్థ ఆదేశాలు కూడా జారీ చేసింది. కష్టపడి పనిచేసే విధానం వల్ల ఆమెకు తర్వాతి ఏడాది జీతాన్ని 8 శాతం పెంచుతూ సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మిగిలిన ఉద్యోగులకు 5 శాతం మాత్రమే జీతంలో పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అంతేకాాకుండా బోనస్ రూపంలో రూ.56 వేలను అందుకుంది. మరోవైపు లక్ష్మి పనితనాన్ని మెచ్చుకుంటూ అమెరికాలోని కంపెనీ వారు ప్రసంశాపత్రాన్ని (అప్రిషియేషన్ లెటర్)ను కూడా పంపిచారు. ఆతర్వాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సంస్థలోనో ఓ మేనేజర్ ఆమెను వివిధ రకాలుగా వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్ని కంపెనీ హెచ్ఆర్తో పాటు మిగిలిన ఉన్నతాధికారులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. పై పెచ్చు అదే ఏడాది అక్టోబర్‌లో హెచ్ఆర్ నుంచి లక్ష్మి పింక్‌స్లిప్ అందుకున్నారు. కారణం అడిగినా ఎటువంటి సమాధానం చెప్పకుండా లక్ష్మిని సెక్యూరిటీ గార్డుతో బయటికి పంపించేశారు. కనీసం తన బ్యాగు, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు తీసుకోవడానికి కూడా ఆమెకు అవకాశం కల్పించలేదు. ఈ విషయమై లక్ష్మి హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె కానిస్టేబుళ్ల ద్వారా తన వస్తువులు తీసుకున్నారు. అనంతరం ఆమె మానసిక ఆరోగ్యంగా కూడా క్షీణించింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇదిలా ఉండగా తనకు జరిగిన అన్యాయంపై లక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. కేసును పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్మికశాఖ ఆ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. కంపెనీ, బాధిత ఉద్యోగి వాదోపవాదాలు ఈ ఏడాది జులై 14 నుంచి సెప్టెంబర్ వరకూ కార్మికశాఖలో సంబంధిత అధికారుల సమక్షంలో కొనసాగాయి. చివరికి సరైన కారణాలు చూపకుండానే లక్ష్మికి పింక్‌స్లిప్ ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఆమెకు జరిగిన నష్టానికి రూ.12.5 లక్షలను పరిహారంగా అందించాలని కంపెనీకి ఆదేశించారు. అంతేకాకుండా సెప్టెంబర్ వరకూ ఆమె సదరు సంస్థలో ఉద్యోగం చేసినట్లు, ఆరోగ్య సమస్యల వల్ల ఆమే కంపెనీకి రాజీనామా చేసినట్లు కూడా సదరు కంపెనీ సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా అధికారులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల లక్ష్మికి మరో చోట ఉద్యోగం సులభంగా లభిస్తుందనేది అధికారుల భావన. అధికారుల సూచనలకు అటు కంపెనీ ప్రతినిధులతో పాటు ఇటు లక్ష్మి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా కంపెనీ చెక్ రూపంలో అందించిన పరిహారం ప్రస్తుతం రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఉందని ఆ శాఖ అదనపు కమిషనర్ జింకాలప్ప స్పష్టం చేశారు. కాగా, జరిమానా చెల్లించిన కంపెనీ దాదాపు 20 ఏళ్లుగా భారత్‌లో ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.