'ఐటీ' కి ఏమైంది ..? | Trump effect on IT employees | Sakshi
Sakshi News home page

'ఐటీ' కి ఏమైంది ..?

Published Tue, May 16 2017 12:35 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

'ఐటీ' కి ఏమైంది ..? - Sakshi

'ఐటీ' కి ఏమైంది ..?

ఉద్యోగుల తొలగింపులు పెరుగుతాయా...
మూడేళ్లలో నాలుగో వంతుకు ఉద్వాసన!
ప్రధాన కారణం కంపెనీల ఆటోమేషన్‌ ప్రక్రియే
ట్రంప్‌– మాంద్యం వంటి కారణాలూ తోడు
మధ్య స్థాయి వారు, సీనియర్లకే తొలి ముప్పు
♦  సర్వీసులపై ఆధారపడ్డ కంపెనీల్లోనే కోతలెక్కువ
♦  సీనియర్లకు ఈ ఏడాది ఇంకా జీతాలు పెంచని టీసీఎస్‌
♦  దేశంలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 45 లక్షలు
♦  ఈ ఏడాది 2–4 శాతం మందిని తొలగించే అవకాశం
♦  ఆటోమేషన్‌తో తగ్గుతున్న కొత్త నియామకాలు
♦  రెవెన్యూ వృద్ధి శాతంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి సగమే  


రోజుకో ఐటీ కంపెనీ... ఈ ఏడాది తాము ఎందరు ఉద్యోగుల్ని తొలగించవచ్చో సూచనప్రాయంగా చెబుతోంది.
రోజుకో కన్సల్టెన్సీ... ఈ ఏడాది భారత ఐటీ రంగంలో ఎందరి ఉద్యోగాలు పోవచ్చో అంచనా వేస్తూ నివేదికలిస్తోంది.
ఇదేమీ అవాస్తవం కాదని నిరూపిస్తూ... ఉద్యోగాలు పోయిన కొందరు కార్మిక శాఖ అధికారుల్ని  సంప్రదిస్తున్నారు.
ఎందుకిలా..? కొన్నేళ్లుగా దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించేదిగా పేరు తెచ్చుకున్న ఐటీ సర్వీసుల రంగానికి ఎందుకీ పరిస్థితి?
కొందరేమో అమెరికాలో ట్రంప్‌ గెలవటమేనంటున్నారు!!.
మరికొందరు ఆటోమేషన్‌ పెరిగింది కనుక ఉద్యోగాలు పోతున్నాయని చెబుతున్నారు!!.
ఇంకొందరు ఐటీ రంగంలో మాంద్యం మొదలైందనటానికి ఇవన్నీ సంకేతాలంటున్నారు!!.
వీటిలో ఏది నిజం? చెప్పాలంటే ఇవన్నీ నిజాలే!! వీటన్నిటికీ తోడు ఐటీ విషయంలో మనం అనుసరిస్తున్న విధానాలూ ఒక కారణమే. ఈ పరిస్థితి ఇండియాకు మాత్రమే పరిమితం కావటం లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులపైనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా 25 లక్షల మంది వరకూ ఉన్న తెలుగువారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిపై వివరణాత్మక కథనాలివి...


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : శివకుమార్‌ పదిహేనేళ్ల కిందట ఓ ఐటీ దిగ్గజ కంపెనీలో చేరాడు. ఆరేళ్ల తరవాత టీమ్‌ లీడర్‌గా... మరో ఆరేళ్ల తరవాత మేనేజరుగా పదోన్నతి పొందాడు. మూడేళ్ల కిందట వైస్‌ ప్రెసిడెంట్‌ హోదా పొందాడు. జీతం ఏడాదికి రూ.42 లక్షలపైనే. ఈ మధ్యే కంపెనీ అతన్ని పనితీరు మదింపు ఆధారంగా తొలగిస్తున్నట్లు చెప్పింది. తననే కాదు!!. తన టీమ్‌లో ఉన్న కొందరు మేనేజర్లనూ తొలగించింది. రెండేళ్లకోసారి చేపట్టే పనితీరు మదింపులో వారు చాలా దిగువ స్థాయిలో ఉన్నారని, అందుకే వారికి ‘పింక్‌ స్లిప్‌’లు అందజేశామని యాజమాన్యం పేర్కొంది. చిత్రమేంటంటే వీరితో పాటు ఆ కంపెనీలో గతేడాది ఎంట్రీలెవల్‌లో ఉద్యోగాల్లో చేరిన మరికొందరికి కూడా పింక్‌ స్లిప్‌లు అందాయి. అది కూడా ‘పనితీరు’ ఆధారంగానే జరిగిందట!!

నిజం చెప్పొద్దూ!! 154 బిలియన్‌ డాలర్ల భారత ఐటీ రంగంలో ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు పోవొచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట. అదొక్కటే కాకపోయినా... దీనికి ప్రధాన కారణం మాత్రం ఆటోమేషన్‌ అనే చెప్పాలి. ఆటోమేషన్‌ కారణంగా కంపెనీల ఆదాయం పెరిగినట్లుగా ఉద్యోగాలు పెరగటం లేదు. గతంలో 10 శాతం ఆదాయం వృద్ధి చెందితే అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనా ఉండేది. ఆటోమేషన్‌ కారణంగా ఇపుడది సగానికి పడిపోయింది. కోతలు మున్ముందు మరింత తీవ్రమై... వచ్చే మూడేళ్లలో ఏకంగా 4వ వంతు ఐటీ ఉద్యోగాలు పోతాయనేది నిపుణుల ఆందోళన.

అంటే... ప్రస్తుత 45 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 11 లక్షల మంది ప్రభావితమవుతారన్న మాట.తొలగింపులకు సంబంధించి కంపెనీలన్నీ ‘పనితీరు’ అనే ఒకేమాట చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు దీంతో విభేదిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 35–50 ఏళ్ల మధ్యవారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ‘‘కంపెనీలు వయసు మీరినవారిని కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. వారి బదులు యువతను తక్కువ జీతాలకు తీసుకుని... నచ్చిన విధంగా శిక్షణ ఇవ్వొచ్చన్నది వాటి ఆలోచన’’ అని ఐటీ కంపెనీలకు మ్యాన్‌పవర్‌ను అందించే కన్సల్టింగ్‌ సంస్థకు చెందిన అనిల్‌ చెప్పారు. ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వారిని తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతాలకొచ్చేవారికి పదోన్నతులిచ్చి కూర్చోబెట్టడమే కంపెనీల ఎజెండాగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతా ‘స్వచ్ఛందంగానే’...!
నిజానికిపుడు లే–ఆఫ్‌లపై ఆందోళనలు పెరుగుతుండటంతో పలు కంపెనీలు ఉద్యోగుల్ని ‘స్వచ్ఛందంగా’ తొలగిస్తున్నాయి. ‘‘ఉద్యోగాల్లో చేరేటపుడే వారి నుంచి తాము వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్లుగా లేఖ రాయించి కొన్ని కంపెనీలు తీసుకుంటాయి. దానిపై ఉద్యోగి సంతకం కూడా ఉంటుంది. అవసరమైనపుడు కంపెనీలు దాన్ని వాడుకుంటాయి. ఇది చాలా ఐటీ కంపెనీల్లో జరిగేదే’’ అని టాప్‌ ఐటీ సంస్థలో మేనేజర్‌ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. మరికొన్ని సంస్థలు సవాలక్ష న్యాయపరమైన నిబంధనలు పెట్టి ఆ పత్రంపై కూడా చేరేటపుడు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి.

 ఒకవేళ తొలగించినా... దాన్లో ఏదో కారణాన్ని చూపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ ఏడాది టీసీఎస్‌లో ఏడేళ్ల వరకూ అనుభవం ఉన్నవారికి మాత్రమే వేతనాలు పెంచారు. అంతకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారికి పెంచలేదు. దానిపై కంపెనీ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇన్ఫోసిస్‌లో అయితే విశాల్‌ సిక్కా పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఐదేళ్ల పాటు సీనియర్లకు  పెంపు ఊసే లేదు. సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇచ్చారు. ‘‘సీనియర్లకు వేతన పెంపు ఉంటుందో లేదో ఇంకా తెలీదు. మాకు ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ తెరవెనక ఏదో జరుగుతోందని మాత్రం అనిపిస్తోంది. ఏదీ పారదర్శకంగా జరగటం లేదు. ఒక్కటి మాత్రం నిజం! ఇకపై ఐటీ కంపెనీల్లో ఏటా మునుపటిలా వేతన పెంపు ఉండాలంటే కుదరకపోవచ్చు’’ అని టీసీఎస్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు వాపోయారు.

తీసివేతలు సహజం...
స్మార్ట్‌ఫోన్ల రాకతో డిజిటల్‌ రంగం ఊపుమీద ఉంది. ఇ–గవర్నెన్స్‌కు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఆటోమేషన్‌తో అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరుగుతోంది. యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు కంపెనీలతోపాటు వినియోగదారులూ సై అంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనకే తయారీ, సేవల కంపెనీలు డిజిటల్‌ వైపు మళ్లుతున్నాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇక్కడ నిపుణులున్నారు కాబట్టే కంపెనీలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఐటీ కంపెనీలకు మంచి భవిష్యత్‌ ఉందనడంలో ఎటువంటి అనుమానం లేదు. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. మందగమనం లేదు. ఉద్యోగుల నియామకాలు, తీసివేతలు సహజం. ప్రతిభ ఉంటేనే కంపెనీలు ఉద్యోగులను కొనసాగిస్తాయి. మేం తొమ్మిది నెలల్లో 2 లక్షల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. భారత్‌లో ఐటీ రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తోంది. కానీ చైనాలా భారత్‌లోనూ ఐటీయేతర రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇతర రంగాల్లో భారీ పెట్టుబడులు రావాలి. ట్రంప్‌ ప్రభావం భారత ఐటీ రంగంపై అతిస్వల్పం. 2017–18 కాలానికి క్యాంపస్‌ నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2018–19కి సెప్టెంబరు నుంచి రిక్రూట్‌మెంట్‌ మొదలుపెడతాం. ఐటీ పరిశ్రమలో 2017లో వేతనాలు 5 శాతం పెరుగుతాయనే అంచనాలున్నాయి.
– వి.రాజన్న, వైస్‌ ప్రెసిడెంట్, టీసీఎస్‌

ఈ ఏడాది 2–4% కోతలు?
కంపెనీలు ఏటా 1–1.5 శాతం ఉద్యోగులకు గుడ్‌బై చెప్పడం సహజం. ఈ సారి ఇది 2 నుంచి 4 శాతం ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పటికే టెక్‌ మహీంద్రా సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించింది. పనితీరు మెరుగ్గా లేని ఉద్యోగుల్ని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తొలగించామని కంపెనీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 2016 డిసెంబరు 31 నాటికి ఈ కంపెనీలో 1,17,095 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో విప్రో 500 మందికి విప్రో గుడ్‌బై చెప్పింది. పనితీరు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

 కంపెనీ తన సిబ్బందికి కొత్త అంశాల్లో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కూడా చేపట్టింది. మరో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ 10,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు సమాచారం. సంస్థకు మొత్తం 2.7 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 70 శాతం దాకా భారత్‌లో ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నియామకాలు, తీసివేతలు నిరంతర ప్రక్రియ అన్నారాయన. ‘‘దాదాపు నాలుగు నెలలుగా బెంచ్‌పై ఉన్నవారికి... ఎక్కువకాలం బిల్లింగ్‌లో లేనివారికి... బిల్లింగ్‌లో ఉన్నా కూడా ఏటా నిర్వహించే నైపుణ్య పరీక్షలో పాస్‌ కానివారికి హెచ్‌ఆర్‌ నుంచి పిలుపులొస్తున్నాయి. రెండు నెలల జీతం ఇచ్చి తొలగించే పద్ధతి మా కంపెనీలో ఉంది. ఆ కోవలోనే చాలామందికి పింక్‌ స్లిప్‌లు అందుతున్నాయి’’ అని కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు.

ఈ సంస్థలు పనితీరు ఆధారంగా దాదాపు 15,000 మంది ఉద్యోగులకు అతి తక్కువ రేటింగ్‌ లభించిందని, వీరిపై వేటు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ ఓ 1,000 మందిపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన జాబితాలో 3,000 మంది సీనియర్లను ఇన్ఫీ చేర్చింది. 10,000 మందికి ఉద్వాసన పలికేందుకు డీఎక్స్‌టీ టెక్నాలజీస్‌ సిద్ధమైనట్టు సమాచారం. సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,70,000 ఉంది. సగం కార్యాలయాలు మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా నైపుణ్యం ఉన్న ఉద్యోగి భవిష్యత్‌కు ఎటువంటి ముప్పులేదని ఇన్ఫోసిస్‌ హెచ్‌ఆర్‌ అధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement