కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌.. ఏరేస్తున్నారు.. | count down starts to terrorists in jammu kashmir | Sakshi
Sakshi News home page

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌.. ఏరేస్తున్నారు..

Published Tue, Aug 1 2017 7:32 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌.. ఏరేస్తున్నారు..

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌.. ఏరేస్తున్నారు..

హిజుబుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాది, పోస్టర్‌బాయ్‌ బుర్హన్‌ వనీ గత ఏడాది జులై 8న జరిగిన ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. అప్పటినుంచి కశ్మీర్‌ అశాంతితో రగులుతూనే ఉంది. దీనికి పుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ‘హిట్‌లిస్ట్‌’ను రూపొందించి మరీ తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మే నెలాఖరులో మాట్లాడుతూ కశ్మీర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని అన్నారు. వ్యూహం సిద్ధం చేశాకే హోంమంత్రి ఈ ప్రకటన చేసినట్లు కనపడుతోంది. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కలిపి మిలిటెంట్ల జాబితాను రూపొందించారు. 253మంది క్రియాశీలంగా ఉగ్రసంస్థల్లో పనిచేస్తున్నట్లు లెక్కతేల్చారు. వీరిలో విదేశీయులు ఎందరు, స్థానికులు ఎందరో గుర్తించారు. ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో పనిచేస్తున్నారో తెలుసుకొని కదలికలపై నిఘాను పెంచారు. 
 
టార్గెట్‌... లీడర్‌
ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్న 12 మందితో జాబితాను రూపొందించి... జూన్‌ ఆరంభంలో విడుదల చేశారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ప్రస్తుత ఆపరేషన్‌ కొనసాగుతోంది. రెండునెలల్లో ఈ జాబితాలో నుంచి ముగ్గురిని మట్టుబెట్టారు. జూన్‌ 16న అనంత్‌నాగ్‌ జిల్లాలోని అర్వానీ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్‌ జునైద్‌ మట్టూ హతమయ్యాడు. మట్టూ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా లష్కరే తీవ్రవాదులు అదేరోజు అనంత్‌నాగ్‌ జిల్లాలోని అచబల్‌ ప్రాంతంలో పోలీసు పార్టీని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
స్థానిక ఎస్‌ఐతో సహా మొత్తం ఆరుగురు పోలీసులు ఈ దాడిలో చనిపోయారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన లష్కరే అనంత్‌నాగ్‌ జిల్లా కమాండర్‌ బషీర్‌ వనీ జులై ఒకటో తేదీన ఎన్‌కౌంటర్లో మరణించాడు. గతంలో భారత భద్రతాబలగాలు చుట్టుముట్టినపుడు దాదాపు పన్నెండు సందర్భాల్లో చాకచక్యంగా తప్పించుకుపోయిన బషీర్‌ వనీ చివరకు సైన్యం వలయంలో చిక్కుకుపోయాడు. వందలాది మంది స్థానికులు ఎన్‌కౌంటర్‌ స్థలానికి వచ్చి ఆర్మీపైకి రాళ్లు రువ్వినా... 24 గంటలపాటు ఆపరేషన్‌ను కొనసాగించి వనీని తుదముట్టించారు. లష్కరే దక్షిణ కశ్మీర్‌ డివిజనల్‌ కమాండర్‌ అబు దుజానా మంగళవారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లో యువతను తీవ్రవాదం వైపు మళ్లించి ఎల్‌ఈటీలో చేర్చించడంలో ఇతనిది కీలకపాత్ర.


 
ఈ ఏడాది జనవరి నుంచి తీసుకుంటే... ఏడునెలల కాలంలో దాదాపు 110మంది తీవ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అయితే జూన్‌ నుంచి భారత సైన్యం వ్యూహం మార్చింది. అగ్రనాయకత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎ++ కేటగిరిలో పది పదిహేను లక్షల రివార్డుతో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాద నాయకులను టార్గెట్‌గా చేసుకుంటోంది. వీరు ఏయే ప్రాంతాలకు వచ్చి వెళుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ సమయంలో వస్తారు, ఎక్కడ బస చేస్తారనే విషయాలను ఇన్‌ఫార్మర్లు, నిఘావర్గాల ద్వారా పక్కాగా సేకరించి అనుమానం రాకుండా ఉచ్చు బిగిస్తోంది. అగ్రనాయకులను ఏరివేస్తే... నాయకత్వలేమితో మిగిలిన తీవ్రవాదులు చెల్లాచెదురవుతారని లేదా లొంగిపోతారనేది భారత సైన్యం వ్యూహం. మిలిటెంట్లను స్థానిక ప్రజల మద్దతు ఉండటంతో భారత భద్రతాబలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి.
 
వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో ఫలానా చోట ఎన్‌కౌంటర్‌ జరుగుతోందనే సమాచారం క్షణాల్లో యువతలో పాకిపోతోంది. దాంతో పెద్దసంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకొని భద్రతాబలగాలపైకి రాళ్ల దాడులు మొదలుపెడుతున్నారు. వీరిని నిలువరించే ఉద్దేశంతో ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని కశ్మీర్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ఫలితం ఉండటం లేదు. భారత సైన్యం దృష్టి మళ్లించి... తీవ్రవాదులు తప్పించుకునేందుకు స్థానిక యువత సహకరిస్తోంది. ఇలాంటి ఘటనల కారణంగానే కాల్పుల్లో మరణించే సాధారణ పౌరుల సంఖ్య అధికంగా ఉంటోంది. అందుకే 300 దాకా ఇలాంటి వాట్సాప్‌ గ్రూపులపై నిఘా పెట్టారు స్థానిక పోలీసులు.


 
మిగిలింది వీరు....
1. రియాజ్‌ నైకూ అలియాస్‌ జుబైర్‌ 
పుల్వామా జిల్లాలోని అవంతిపోర్‌ ప్రాంతానికి చెందినవాడు. అధునాతన సాంకేతికతపై పట్టున్నవాడు. కరడుగట్టిన హిజుబుల్‌ తీవ్రవాదులకు భిన్నమైన మనస్తత్వం కలిగినవాడు. ఈ 29 ఏళ్ల నైకూపై 12 లక్షల రివార్డు ఉంది. ఈ ఏడాది జూన్‌ ఆరంభంలో హిజుబుల్‌ ముజాహిదీన్‌ కశ్మీర్‌ చీఫ్‌గా నియమితుడయ్యాడు.
 
2. జకీర్‌ మూసా
కరడుగట్టిన తీవ్రవాది. హురియత్‌ నేతల లౌకికవాద వైఖరితో విభేదించి... వారి తలలు తీయాలని పిలుపిచ్చాడు. ఇదే అంశంపై పాక్‌లోని హిజుబుల్‌ అగ్రనాయకత్వంతో విబేధించి ఈ ఏడాది మేలో ఆ సంస్థకు దూరమయ్యాడు. కశ్మీర్‌ లోయలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనేది ఇతని వాదన. తర్వాత ఇతన్ని అల్‌కైదా తమ కశ్మీర్‌ చీఫ్‌గా ప్రకటించింది.  
 
3. జీనత్‌ ఉల్‌ ఇస్లామ్‌
లష్కరే తీవ్రవాది. 2015 నవంబరులో ఎల్‌ఈటీలో చేరాడు. సోపియాన్‌ జిల్లాలోని సుగాన్‌ జానీపురా వాసి. ఎ కేటగిరిలో ఉన్నాడు.
 
4. అబు హమస్‌ 
జైషే మహమ్మద్‌ డివిజినల్‌ కమాండర్‌. పాక్‌కు చెందిన ఇతను 2016లో కశ్మీర్‌ లోయలోకి చొరబడి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. 
 
5. సద్దాం పద్దార్‌ అలియాస్‌ జైద్‌
హిజుబుల్‌ ముజాహిదీన్‌ సోపియాన్‌ జిల్లా కమాండర్‌. 2015 సెప్టెంబరులో ఈ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఇదే జిల్లాలోని షీర్మల్‌ గ్రామానికి చెందినవాడు. 
 
6. షౌకత్‌ తక్‌
ఎల్‌ఈటీ పుల్వామా జిల్లా కమాండర్‌. ఇదే జిల్లాలోని పంజ్‌గామ్‌ గ్రామానికి చెందినవాడు. 2011లో ఈ ఉగ్రసంస్థలో చేరాడు. 
 
7. మహ్మద్‌ యాసిన్‌ ఇట్టూ అలియాస్‌ మాన్‌సూన్‌
హిజుబుల్‌ బద్గాం జిల్లా కమాండర్‌. 2015 డిసెంబరులో ఈ ఉగ్రసంస్థలో చేరాడు. బద్గాం జిల్లాలోని చదూరా వాసి.
 
8. వసీం అలియాస్‌ ఒసామా
లష్కరే తోయిబా సోపియాన్‌ జిల్లా కమాండర్‌. 2014లో హిజుబుల్‌లో చేరి బుర్హన్‌ వనీతో కలిసి పనిచేశాడు. తర్వాత ఎల్‌ఈటీలో చేరాడు. 
 
9. అల్తాఫ్‌ దార్‌ అలియాస్‌ కచ్రూ
హిజుబుల్‌ ముజాహిదీన్‌ కుల్గాం జిల్లా కమాండర్‌. కుల్గాం జిల్లాలోని హవరా గ్రామానికి చెందినవాడు. 2012లో ఉగ్రబాట పట్టాడు.
 
సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement