న్యూఢిల్లీః భారత నగరాలు, గ్రామీణ ప్రాంతాలు అగ్నిమాపక కేంద్రాల కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లోక్ సభ తెలిపింది. దేశంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా ఉండాల్సిన కేంద్రాలు.. కేవలం మూడు వేల పైచిలుకు ఉన్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు.
దేశంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాలను అగ్నిమాపక కేంద్రాల కొరత వేధిస్తోందని లోక్ సభ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8,559 ఫైర్ స్టేషన్ల అవసరం ఉండగా, కేవలం 2,987 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీంతో అగ్నిమాపక సేవల్లో 65 శాతం లోటు కనిపిస్తోందని హోం శాఖ సహాయ మంత్రి రిజిజు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవసరానికి అనుగుణంగా అర్బన్ ఏరియాలకు 5 నుంచి 7 నిమిషాల్లోనూ, గ్రామీణ ప్రాంతాలకు 20 నమిషాల్లోపు వెళ్ళేలా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలంటే... అవసరమైనన్ని అగ్నిమాపక కేంద్రాలుండాలని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిగిన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో అగ్నిమాపక సేవలను పురపాలక కేంద్రాలు నిర్వహించడమే కాక, అగ్ని ప్రమాదాలను అధిగమించాలంటే కేంద్రం కూడ నిధులతోపాటు, తగినంత సహకారం అందించి, సిబ్బందికి అత్యవసర సేవల్లో నాణ్యత పెరిగేలా శిక్షణ కూడ అందించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2012 లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆధునీకరణను అమల్లోకి తెచ్చి, తగిన పరికరాలను అందుబాటులో ఉంచడం ఎంతైనా అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అర్బన్ ఏరియాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణను దృష్టిలో ఉంచుకొని నాగపూర్ లోని నేషనల్ ఫైర్స్ సర్వీస్ కాలేజ్ ఫైర్ ఆఫీసర్స్ కు ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తోందని, అగ్ని ప్రమాదాల సమయంలో ఆధునిక పద్ధతుల వాడకం, సందర్భాను సారం స్పందించేందుకు కావలసిన పద్ధతులను నేర్పిస్తోందని రిజుజు ఓ రాత ప్రతిలో తెలిపారు.
దేశంలో అగ్నిమాపక కేంద్రాల కొరత!
Published Tue, May 10 2016 3:54 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement