ఆకలి రాజ్యం.. భారత్
దేశంలో 19.4 కోట్ల మంది ఆకలి కేకలు
చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే మొదటిస్థానం: ఐరాస వెల్లడి
రోమ్/న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు భారత్‌లోనే ఎక్కువ మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దేశంలో ఏకంగా 19.4 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య 79.5 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇది 1990-92లో వందకోట్లుగా ఉంది. చైనాలో ఆకలితో బాధపడేవారి సంఖ్య 28.9 నుంచి 13.3 కోట్లకు పడిపోవడంతో ఈ తగ్గుదల నమోదైందని వివరించింది.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం, వ్యవసాయ విభాగం (ఎఫ్‌ఏఓ) తాజాగా 2014-15 సంవత్సరానికిగాను ప్రపంచ దేశాల్లో ఆకలిపై నివేదిక(ద స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ 2015) విడుదల చేసింది. ఇందులో 19.4 కోట్ల మందితో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. 1990తో పోల్చుకుంటే దేశంలో ఆకలి కేకలు తగ్గినా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనానికి తిండి అందడం లేదని వివరించింది. ఆకలిని తరిమికొట్టేందుకు భారత్‌లో అనేక పథకాలు అమలవుతున్న విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారు. అలాగే పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో ఎఫ్‌ఏఓ అధ్యయనం చేసిన 129 దేశాల్లో 72 దేశాలు గడచిన దశాబ్దకాలంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించాయని తెలిపింది.