హోటల్ గదిలో యువ జంట ఆత్మహత్య...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఓ యువజంట ఆత్మహత్య కలకలం రేపింది. ఓయో ఆన్‌లైన్ హోటల్ సర్వీస్ ద్వార రూమ్ ను బుక్ చేసుకున్న ఆ జంట శుక్రవారం ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పిడింది. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారఖా సెక్టార్ 17 లో చోటుచేసుకుంది. ఓ యువకుడు(20), యువతి(19) గురువారం ఆన్‌లైన్ బుకింగ్ ద్వార గది బుక్ చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హౌస్ కీపింగ్ సిబ్బంది పదేపదే తలుపు తట్టినా సమాధానం రాలేదు.
దీంతో హోటల్ సిబ్బంది తలుపు పగలకొట్టి లోపలి వెళ్లి చూశారు. అయితే అప్పటికే వారు ఉరేసుకొని విగతజీవులుగా ఉన్నారు. హోటల్ మేనజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా భావించారు. పలుకోణాల్లో విచారణ జరిపాక ధృవీకరిస్తామని తెలిపారు. యువకుడు ద్వారకా సెక్టార్16 కు చెందినవాడని, అమ్మాయి ఢిల్లీ రోహిని ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని, వీరు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారి ఆత్మహత్యకు గల కారణాలను త్వరలో తెలియజేస్తామన్నారు.