'హార్థిక్ వెనుక విదేశీ హస్తం'!
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న యువ కెరటం హార్థిక్ పటేల్ కస్టడీని అహ్మదాబాద్ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో ఆయన నవంబర్ 3 వరకు పోలీసుల అదుపులో ఉండనున్నారు. మరో వారం రోజులపాటు తమ కస్టడీలో ఉంచేందుకు అనుమతించాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించగా రెండు రోజులు అనుమతించారు. అంతకుముందు వారం రోజుల గడువుతో హార్థిక్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ గడువు అయిపోవడంతో కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో వారం గడువు కోరారు.
హార్ధిక్ పటేల్ తమకు విచారణకు సహకరించడం లేదని, మొత్తం 452 గ్రూపులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించామని కోర్టుకు తెలిపారు. ఆగస్టు 25న నిర్వహించిన ర్యాలీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేయాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. వీరి ఆందోళనకు విదేశీ హస్తం కూడా ఉందని, అక్కడి నుంచి వీరికి నిధులు సమకూరుతున్నాయనే అనుమానం కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించడం అత్యవసరం అని తాము భావిస్తున్నామని క్రైం బ్రాంచ్ కోర్టుకు వివరించింది.
దేశద్రోహం, సమాజంలో అలజడులు సృష్టించడం వంటి తీవ్ర ఆరోపణలతో గతవారం హార్థిక్ పటేల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా అంతకుముందు తీర్పునిచ్చిన విషయం విధితమే.