సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలకు అనుమతులను సాధించింది. జూలైలో దేశవ్యాప్తంగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది.
కోవిడ్ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’. కరోనా కట్టడికి మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి లాంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్‌అండ్‌డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు.
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నఔషధ తయారీదారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో భారత్, వ్యాక్సిన్లు, జెనెరిక్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు 30 గ్రూపులు పనిచేస్తున్నాయని మేలో ప్రభుత్వం తెలిపింది. కాగా భారతదేశంలో 16,475 మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ మహమ్మారికి బలి కాగా, భారతదేశంలో దాదాపు 5.5 లక్షలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనాకు భారీగా ప్రభావితమైన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment