
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో ఏకంగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 140 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
6.39% బాధితులకే ఆస్పత్రి సేవలు అవసరం
దేశంలో యాక్టివ్ కేసుల్లో 6.39 శాతం బాధితులకే ఆసుపత్రుల్లో సేవలు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. అలాగే 2.94 శాతం బాధితులకు ఆక్సిజన్ సపోర్టు, 3 శాతం మందికి ఐసీయూ సేవలు, 0.45 శాతం మంది బాధితులకు వెంటిలేటర్ సపోర్టు అవసరమని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 62 మందికి కరోనా సోకిందని తెలిపారు.
వలస కూలీల కోసం హెల్ప్‌లైన్
వలస కూలీలు తమ ఇబ్బందులు, ఫిర్యాదులను తెలిపేందుకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటే ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. అయితే, అది టోల్‌ఫ్రీ నెంబర్‌గా ఉండబోదని బుధవారం టెలీకాం విభాగం(డీఓటీ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.