
డెహ్రాడూన్‌లో నిరుపేద బాలలకు ఆహారం పంపిణీ చేస్తున్న పోలీసు అధికారి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య శుక్రవారానికి 206కి చేరుకుంది. దాదాపు 6,761 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 503 మందికి జబ్బు నయమైందని తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి దాదాపు 30 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 25 మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని, గుజరాత్, జార్ఖండ్‌లలోనూ ఒక్కొక్కరు చొప్పున మరణించారని ఆరోగ్యశాఖ వివరించింది.
ఇప్పటివరకూ మహారాష్ట్రలో 97 మంది కోవిడ్–19కి బలికాగా, గుజరాత్‌లో 17 మంది, మధ్యప్రదేశ్‌లో 16 మంది, ఢిల్లీలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, తమిళనాడులలో ఎనిమిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో ఐదుగురు చొప్పున కోవిడ్‌కు బలయ్యారు. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లలో నలుగురు చొప్పున, హరియాణా, రాజస్తాన్‌లలో ముగ్గురు చొప్పున బలయ్యారు. కేరళ, బిహార్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇద్దరు చొప్పున, ఒడిశా, జార్ఖండ్‌లలో ఒకొక్కరు ప్రాణాలొదిలారు. దేశం మొత్తమ్మీద వైరస్ బారిన పడ్డ 6,761 మందిలో 71 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం సాయంత్రానికి వైరస్‌తో 169 మంది మరణించారు.
మహారాష్ట్రలో అత్యధిక కేసులు...
మహారాష్ట్రలో మొత్తం 1,364 కేసులు ఉండగా, తమిళనాడులో 834, ఢిల్లీలో 720 వరకు కేసులు ఉన్నాయి. రాజస్తాన్‌లో 463, ఉత్తరప్రదేశ్‌లో 410, కేరళలో 357, మధ్యప్రదేశ్‌లో 259, గుజరాత్‌లో 241 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 181 కేసులు ఉండగా, హరియాణాలో 169 కేసులు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ (158), పశ్చిమ బెంగాల్ (116), పంజాబ్ (101), పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో మొత్తం 44 కేసులు నమోదు కాగా, బిహార్‌లో 39 మంది, ఉత్తరాఖండ్‌లో 35 మంది వైరస్ బారిన పడ్డారు. అసోంలో 29, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో 18 మంది చొప్పున కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారు.