న్యూఢిల్లీ: లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు వీలుగా ఆంక్షల సడలింపు ఉండాలంటున్నాయి. కేంద్రం కొన్ని కఠిన నిబంధనలను సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ఈ నెల 17తో ముగియనున్న విషయం తెలిసిందే. ‘లాక్‌డౌన్ 4.0లో అనేక సడలింపులుంటాయి. గ్రీన్ జోన్‌లో పూర్తిగా అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఆరెంజ్ జోన్‌లో మాత్రం కొన్ని ఆంక్షలుంటాయి. రెడ్‌జోన్‌ల్లోని కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలుంటాయి’ అని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
నిబంధనల సడలింపుల్లో రాష్ట్రాలకు అధికారమివ్వవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఉండాలని తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు కోరుతున్నాయని హోంశాఖలోని మరో అధికారి తెలిపారు. లాక్‌డౌన్ 4.0లో జోన్‌లను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చే అవకాశముందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా హాల్స్ మూసివేత కొనసాగుతుందన్నారు. కంటెయిన్‌మెంట్ ప్రాంతాలను మినహాయించి రెడ్ జోన్స్‌లో కూడా క్షౌర శాలలను, ఆప్టికల్ షాపులను తెరిచేందుకు అవకాశమివ్వవచ్చని తెలిపారు. వచ్చే వారం నుంచి అవసరాన్ని బట్టి పరిమితంగా రైళ్లను, విమానాలను నడిపేందుకు అనుమతించే ఆలోచన కూడా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment