న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ మెరుపు వేగంతో విస్తరిస్తోంది. ప్రజల అజాగ్రత్త, అవగాహనా లోపంతో మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఒక్క రోజులో 14,516 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే గంటకు 604 మంది కరోనా బారినపడినట్లు స్పష్టమవుతోంది. దేశంలో 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడడం ఇదే ప్రథమం.
తాజాగా 375 మంది కరోనా బాధితులు తుదిశ్వాస విడిచారు. దీంతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసులు 3,95,048కు, మరణాలు 12,948కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. 2,13,830 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 1,68,269. రికవరీ రేటు 54.12 శాతానికి చేరడం ఊరట కలిగించే పరిణామం అని చెప్పొచ్చు. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. ఆయా రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 2 లక్షలకుపైగా కేసులు వెలుగులోకొచ్చాయి. మరణాల సంఖ్యలో ప్రపంచంలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment