కరోనా: సీనియర్ వీడియో జర్నలిస్టు మృతి | COVID19 : TN video journalist Vel Murugan succumbs in Chennai | Sakshi
Sakshi News home page

కరోనాతో సీనియర్ వీడియో జర్నలిస్టు కన్నుమూత

Published Sat, Jun 27 2020 4:12 PM | Last Updated on Sat, Jun 27 2020 4:44 PM

COVID19 : TN video journalist Vel Murugan succumbs in Chennai - Sakshi

వేల్ మురుగన్(ఫైల్ ఫోటో)

సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి తమిళనాడులో సీనియర్ వీడియో జర్నలిస్టును బలితీసుకుంది. 15 రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో  వేల్ మురుగన్(41) చెన్నైలోని  రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్‌జీజీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో తోటి జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రారంభ రోజుల్లో ఫ్రెషర్లుగా మీడియా రంగంలోకి ప్రవేశించిన మిత్రులకు మురుగన్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు.

మురుగన్ అకాలమరణంపై స్పందించిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. మురుగన్ భార్య షణ్ముగ సుందరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మీడియా మిత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం )

అటు డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ ట్విటర్ ద్వారా జర్నలిస్టు మరణంపై విచారాన్ని ప్రకటించారు. మీడియా జర్నలిస్టులు సేఫ్టీపై ప్రధానంగా దృష్టిపెట్టాలని కోరారు. మీడియాలో పనిచేసేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో మురుగన్ ఉదంతం తెలియజెప్పిందని ఎండిఎంకె నాయకుడు వైకో వ్యాఖ్యానించారు. మురుగన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని ప్రకటించారు. మీడియాలోని కామ్రేడ్లందరూ తీసుకోవలసిన భద్రతా చర్యలపై మీడియా సంస్థలు, ప్రభుత్వం మార్గ నిర్దేశనం చేయాలన్నారు.

గత 20 సంవత్సరాలుగా వివిధ తమిళ టెలివిజన్ ఛానెళ్లలోవెల్ మురుగన్ కెమెరాపర్సన్‌గా పనిచేశారు. మురుగన్ కు భార్య, ఒక కుమారుడు ఉండగా, భార్య షణ్ముగ సుందరి ఆర్‌జీజీజీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement