
ఆవులకు అందాల పోటీలు!
హరియాణాః ఆవులకు పాలిచ్చే విషయంలో పోటీలు పెట్టడం చూశాం. అలాగే ఎడ్ల బండి పోటీలగురించీ విన్నాం. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆవులకు అందాల పోటీలు నిర్వహిస్తోంది. తొలిసారిగా రోఠక్ జిల్లా ఆ పోటీలకు వేదిక కానుంది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న వాటిలో ఎంపికైన వాటికి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. యజమానులు అందంగా అలంకరించి తెచ్చిన ఆవులు, ఎద్దులు ర్యాంప్ పై క్యాట్ వాక్ కూడ చేసి చూపరులను అలరించనున్నాయి. పోటీల్లో పాల్గొని విజేతలైన ఆయా ఆవులు, ఎద్దుల యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం అందిస్తారు.
దేశీ ఆవులకు నిర్వహించే ఫ్యాషన్ షో కు హరియాణా సిద్ధమైంది. ఆవులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి.. ఇప్పడు అందర్నీ ఆకట్టుకోనున్నాయి. రాష్ట్రంలోని రోఠక్ జిల్లా, బహుఅక్బర్పూర్ గ్రామంలో జరిగే ఆవుల సౌందర్య పోటీల్లో అన్నింటికంటే అందంగా ఉన్న, అత్యధిక పాలను అందించే ఆవులను ఎంపిక చేసి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. వాటి యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం కూడ ఇస్తారు. ఆవుల అభివృద్ధికోసం పశుపాలనా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హరియాణా గోసేవా ఆయోగ్ ఛైర్మన్ భానే రాం మంగళా ముఖ్య అతిథిగా హాజరౌతారు. ఇతర నగర ప్రముఖులు, అధికారులు, నాయకుల అధ్యక్షతన జరిగే కార్యక్రమం మే 6, 7 తేదీల్లో జరగనున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
'కౌ ర్యాంప్ క్యాట్ వాక్' షో... బహుఅక్బర్ పూర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు నోడల్ అధికారి ప్రేమ్ సింహ్ వెల్లడించారు. ఈ ర్యాంప్ షోలో ఆరు రాష్ట్రాలకు చెందిన వివిధ దేశీ ఆవులు పాల్గొంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే ఆయా పశువుల యజమానులు మే 5 తేదీ సాయంత్రానికి కార్యక్రమ స్థలానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మే 6వ తేదీ ఉదయం, సాయంత్రం ప్రదర్శనలో పాల్గొని ఎంపికైన ఆవులతో 7వ తేదీ క్యాట్ వాక్ కార్యక్రమాన్ని మనోరంజకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజేతలైన ఆవులు, ఎద్దుల యజమానులకు వ్యవసాయ మంత్రి ఓం ప్రకాష్ ఘన్ ఖడ్ బహుమతులు ఇచ్చి సన్మానిస్తారు. ఆవులకు ఇటువంటి క్యాట్ వాక్ షో దేశంలోనే మొదటిసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గో సంరక్షణ, అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.