ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’ | Cow-Slaughter Claims Raise Questions About Bulandshahr Violence | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 8 2018 2:35 PM | Last Updated on Sat, Dec 8 2018 2:46 PM

Cow-Slaughter Claims Raise Questions About Bulandshahr Violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ రోడ్డుపై సోమవారం జరిగిన హిందూత్వ మూకల విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం నాడు మాట మార్చి అది ఒక ప్రమాదం మాత్రమేనని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన శాంతిభద్రల సమస్య ఎంత మాత్రం కాదని, ఆ నాటి విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ కూడా వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘ఎవరో, ఎక్కడి నుంచో పశు కళేబరాలను తీసుకొచ్చి ఇక్కడెందుకు వేశారు? వారి ఉద్దేశం ఏమిటీ? ఎలాంటి పరిస్థితుల్లో వారీ పని చేశారు?’ అంటూ ఆయన వేసిన ప్రశ్నల్లో అనుమానపు ఆనవాళ్లు లేవా?

నాటి విధ్వంసకాండలో సుమిత్‌ కుమార్‌ అనే 20 ఏళ్ల పౌరుడితోపాటు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ మరణించడం మామూలు విషయం కాదు. పైగా యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్‌ అఖ్లాక్‌ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం ఎంత మాత్రం యాధృశ్చికం కాదు. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్‌ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్‌ దళ్‌ నాయకులు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే.

హింసాకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్‌ రాజ్‌ కూడా భజరంగ్‌ దళ్‌ నాయకుడు కావడం గమనార్హం. ఆ రోజు తాను తన మిత్రులతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు పక్క పొలంలో ఏడుగురు వ్యక్తులు పశువును కోస్తుండడం కనిపించిందని తాను అక్కడికి వెళ్లే వరకల్లా వారంతా పారిపోయారని యోగేశ్‌ రాజ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగేష్‌ రాజ్‌ సోదరి సుమత్‌ మహర్‌ కథనం అందుకు భిన్నంగా ఉంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడి నుంచో ఫోన్‌ వస్తే యోగేష్‌ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారని ఆమె తెలిపారు. పైగా పొలంలో పడి ఉన్న పశు ఎముకలు తాజావి కావని, రెండు, మూడు రోజుల క్రితం చంపేసిన పశు కళేబరాలని అక్కడికి స్వయంగా వెళ్లి పరిశీలించినన సియాన తహసిల్దార్‌ రాజ్‌కుమార్‌ భాస్కర్‌ చెప్పడం కూడా గమనార్హం. పశు ఎముకలు కనిపించిన మహావ్‌ గ్రామం పొలం పక్కనే ఉన్న చెరకు తోటలో ఆవు తలకాయ, తోలు ఆరేసి ఉన్నాయని, మాంసం కోసం ఆవును చంపేసే వాళ్లు ఇలా ‘ఎగ్జిబిట్‌’ చేయరని ఆయన చెప్పారు.

తన గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలు ఆవును చంపడం తాను కళ్లారా చూశానంటూ సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సియానా గ్రామంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నయాబామ్‌ గ్రామానికి చెందిన యోగేశ్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారు. ఆయన పేర్కొన్న ఏడుగురు ముస్లింలలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వస్తుండగా, వారు ఆవు మాంసం తీస్తు కనిపించారని, దగ్గరికెళ్లే సరికి పారిపోయారని రాజ్‌ అంతకుముందు వీడియా ముఖంగా కూడా చెప్పారు. అలా పారిపోయిన వారిని ఆయన పేర్లతో సహా ఎలా కనిపెట్టారన్నది మరో ప్రశ్న. ఆ ఎముకలు రెండు, మూడు రోజుల క్రితం చంపిన ఆవు వన్నప్పుడు, ఆ ఏడుగురు అక్కడ ఉండే అవకాశం ఉందా? సియాన పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుభోత్‌ కుమార్‌ సింగ్‌ అప్పటికే ఛింగ్రావతి పోలీసు అవుట్‌ పోస్ట్‌ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆ విషయం సియాన పోలీసు స్టేషన్‌కు అందలేదా? అందలేదనుకుంటే అదనపు బలగాలను అక్కడి నుంచి ఎలా పంపించారు?

ఛింగ్రావత పోలీసు అవుట్‌ పోస్ట్‌ వద్ద పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సుభోద్‌ కుమార్‌ సింగ్‌తో భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌ వాగ్వాదానికి దిగడం పలు సెల్‌ఫోన్‌ వీడియోల్లో కూడా రికార్డయింది. ఆ తర్వాత సుభోద్‌ తలలో బుల్లెట్‌ గాయంతో మరణించాడు? ఎలా జరిగింది ? ఎముకలను తీసుకొచ్చిన ట్రాక్టర్‌ ఏమయింది? ఫోరెన్సిక్‌లాబ్‌కు పంపించాల్సిన ట్రాక్టర్‌లోని ఎముకలు ఎందుకు అదృశ్యమయ్యాయి? పొలంలో కూడా ఎముకల ఆనవాళ్లు లేకుండా ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? యోగేశ్‌ రాజ్‌ ఫిర్యాదు మేరకు ఏడుగురు ముస్లింలను అరెస్ట్‌ చేసిన పోలీసులు విధ్వంసకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. పారిపోయే అవకాశం ఆయనకు ఎందుకు ఇచ్చారు? ఛింగ్రావతి పోలీసు అవుట్‌ పోస్ట్‌ వద్ద విధ్వంసకాండ జరిగితే చుట్టుపక్కలున్న ఏడు గ్రామాల ప్రజలు, అంతా యువకులే వాహనాల్లో ఎలా వచ్చారు? వారి వద్ద తుపాకులు ఎందుకు ఉన్నాయి?

ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక మరణించిన పిల్లలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి నిరాకరించిన యోగి ఆదిత్యనాథ్‌ సంఘటన జరిగిన రోజే సుబోధ్‌ కుమార్‌ కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్ట పరిహారం, భార్యకు లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ అంత ఉదాహరంగా ఎలా ప్రకటించారు? ఇద్దరు మరణానికి కారణమైన విధ్వంసకాండ కేంద్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసులు ఆవును చంపడం తీవ్రమైన నేరం అంటూ ఆ దిశగానే దర్యాప్తు జరపడం కుట్రలో భాగం కాదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement