కామ్రేడ్ కొంప ముంచిన కరెన్సీ కల
పాపం కామ్రేడ్కు చిరకాల కోరికయితే తీరింది కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. తాను ప్రేమించే పార్టీ నుంచి సస్పెండయ్యారు. త్రిపుర అధికార పార్టీ సీపీఎం నాయకుడు సమర్ ఆచార్జీ కథే ఇది. రూ.20 లక్షల నోట్ల కట్టలను పరుపులా పరచి వాటిపై నిద్రపోయిన ఆచార్జీని సీపీఎం పార్టీ సస్పెండ్ చేసింది. 'ఆచార్జీ చర్యలు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు విరుద్ధం. ఆయన చర్య పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంది. అందువల్ల పార్టీ నుంచి ఆచార్జీని సస్పెండ్ చేస్తున్నాం' అని సీపీఎం డివిజన్ కమిటీ కార్యదర్శి సుబ్రత చక్రవర్తి ప్రకటించారు.
త్రిపురలోని జోగేంద్రనగర్ సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆచార్జీ.. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీయడం సంచలనం రేకెత్తించింది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు కూడా. కానీ ఆ దృశ్యాలు గురువారం టీవీ చానల్లో ప్రత్యక్షం కావడంతో చిక్కుల్లో పడ్డారు. సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించీ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు సంపదను పోగేసుకున్నారంటూ ఆచార్జీ చేసిన విమర్శలూ టీవీలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.