యోగా.. ఓ బిజినెస్‌ మంత్ర! | Craze for yoga turns into source of income for many | Sakshi
Sakshi News home page

యోగా.. ఓ బిజినెస్‌ మంత్ర!

Published Fri, Jun 22 2018 2:46 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

Craze for yoga turns into source of income for many - Sakshi

యోగా.. సాధకులకు శారీరక, మానసిక, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని అయితే.. మరి కొందరు ఔత్సాహికులకు ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా అందించే బిజినెస్‌ మంత్ర కూడా. దాదాపు నాలుగేళ్ల కిత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్‌ 21వ తేదీని నిర్ధారించినప్పటి నుంచీ.. యోగా వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతోంది. యోగా నేర్పించే సంస్థల దగ్గర్నుంచి యోగాసనాలు చెయ్యడానికి వాడే చాపలు, యోగా డ్రింక్స్, యోగా చేసే సమయంలో వాడే దుస్తులు వంటి వాటి చుట్టూ గత మూడేళ్లుగా వ్యాపారం బాగా పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా యోగాతో ఇంచుమించుగా రూ.5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతూ ఉంటే, భారత్‌లో 85 వేల కోట్లకు  పైగా వ్యాపారం జరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. గత అయిదేళ్లలోనే యోగా సెంటర్లు, యోగాకి సంబంధించిన ఉత్పత్తుల చుట్టూ జరిగే వ్యాపారం 87 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది యోగాను ఫాలో అవుతున్నారని, వారిలో అమెరికాలోనే 3 కోట్ల మంది ఉన్నారని అంచనా. అమెరికాలో వ్యాపార పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యోగాది నాలుగో స్థానం.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, యూరప్, ఐర్లాండ్‌ల్లో  యోగాకి క్రేజ్‌ ఎక్కువ. భారత్‌లో మెట్రోనగరాల్లో యోగా పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. శిల్పాషెట్టి, కరీనాకపూర్‌ వంటి సెలబ్రిటీల యోగా వీడియోలు సామాన్య జనాల్లోనూ యోగా పట్ల ఆసక్తిని పెంచాయి. యోగా శిక్షకులకి వచ్చే ఏడాదిలో 30 నుంచి 35% డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. బాబా రామ్‌దేవ్‌ తనకున్న యోగా ఇమేజ్‌తోనే పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని 10 వేల కోట్లకి విస్తరించారు.

యోగా జల్‌.. యోగా బార్‌
యోగా చుట్టూ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మన దేశంలో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు కొత్త వ్యూహాల్ని రచిస్తున్నాయి. కొత్త, కొత్త ఉత్పత్తులతో యోగా సాధకుల్ని ఆకట్టుకుంటున్నాయి. యోగా సాధన కోసం ప్రత్యేకంగా వాడే మ్యాట్స్‌కి ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. జూట్, నేచరల్‌ రబ్బరు కలగలిపిన మిశ్రమంతో తయారు చేసే ఈ మ్యాట్స్‌ చాలా తేలికగా ఉంటాయి. మడతపెట్టి ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు.

చెన్నైలో తయారవుతున్న ఈ మ్యాట్స్‌కి బాగా క్రేజ్‌ పెరిగింది. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్‌ కంపెనీ యోగా జల్‌ను తయారు చేస్తోంది. ఇందులో కృత్రిమ రంగులేవీ వాడరు.  ఇందులో 8 నుంచి 10 శాతం సల్ఫర్‌ ఫ్రీ షుగర్‌ ఉంటుంది. బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్‌ కంపెనీ యోగా బార్స్‌ని తయారు చేస్తోంది. మామూలు చాక్లెట్స్‌ బార్స్‌ బదులుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యకరం అని ఆ సంస్థ ప్రచారం చేస్తోంది.

రసాయనాలు వాడకుండా సహజసిద్ధ పదార్థాలు, విటమిన్లు వినియోగించి తయారు చేస్తున్న ఈ యోగా బార్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ‘ఫరెవర్‌ యోగా’ పేరుతో ఈ నాటి యూత్‌ ఫ్యాషన్‌లను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న దుస్తులకు కూడా మంచి మార్కెట్టే ఏర్పడింది. ఇక బెంగుళూరుకు చెందిన అక్షర పవర్‌ యోగా సెంటర్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. యోగా టీచర్లకి కూడా ఈ సెంటర్‌లో శిక్షణనిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తోంది.

► ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తు న్నవారి సంఖ్య – 30 కోట్లకి పైగా..
► భారత్‌లో యోగా శిక్షకుల సంఖ్య – 2 లక్షల మంది
► ఇంకా కావల్సిన శిక్షకుల సంఖ్య – 5 లక్షలు  
► చైనాలో యోగా పాఠాలు చెబుతున్న ఇండియన్లు  – 3 వేలు
► భారతీయులు ప్రతీ నెలా యోగాపై ఖర్చు చేస్తున్నది – రూ. 5 వేల నుంచి 25 వేలు(సగటున)  
► అంతర్జాతీయ యోగా డే కోసం 2015, 2016ల్లో భారత్‌ ఖర్చు చేసింది – రూ. 35.50 కోట్లు  
► యోగా చుట్టూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారం – 8 వేల కోట్ల డాలర్లు (రూ. 5, 42, 000 కోట్లు)
► భారత్‌లో జరుగుతున్న వ్యాపారం – రూ. 85 వేల కోట్లు.


– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement