రిఫరెండంలో రష్యావైపే క్రిమియా ఓటు!
సింఫెరొపోల్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లోని స్వయంప్రతిపత్తిగల ప్రాంతమైన క్రిమియా కీలక నిర్ణయం దిశగా కదిలింది. రష్యాలో చేరాలా లేక మరిన్ని అధికారాలతో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా అనే అంశంపై ఆదివారం రిఫరెండం నిర్వహించింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రష్యా జెండాలు రెపరెపలాడగా మరికొన్ని చోట్ల రష్యా అనుకూల మిలిషియా సభ్యులు గస్తీ నిర్వహిస్తూ కనిపించారు. రోడ్లపై ప్రజలు రష్యా అనుకూల నినాదాలు చేశారు. రష్యా అనుకూల క్రమియా ప్రధాని సెర్గీ అక్స్యొనోవ్ క్రిమియా రాజధాని సింఫెరొపోల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రిఫెరెండం చరిత్రాత్మక సందర్భమని...ఇకపై ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారని వ్యాఖ్యానించారు. అయితే క్రిమియాలో ఎక్కువ మంది రష్యాలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ రిఫరెండం ఫలితాన్ని తాము గుర్తించబోమని ఉక్రెయిన్ నూతన ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ సమాజం తేల్చిచెప్పింది. కడపటి వార్తల ప్రకారం...70 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ పూర్తికాగానే ఫలితాలను ప్రకటిస్తామని క్రిమియా అధికారులు తెలిపారు.