రష్యాలోకి క్రిమియా
లాంఛనంగా చేరిక
ఒప్పందంపై దేశాధ్యక్షుడు పుతిన్ సంతకం
జాతిని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం
మండిపడ్డ పశ్చిమ దేశాలు జీ-8 కూటమి నుంచి రష్యా సస్పెన్షన్
మాస్కో: ఉక్రెయిన్ నుంచి రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా లాంఛనంగా రష్యాలో అంతర్భాగమైంది. మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామన్న పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరుచేస్తూ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మంగళవారం క్రిమియాను రష్యా సమాఖ్యలో చేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. క్రిమియాను తమ దేశంలో చేర్చుకోవడం ద్వారా గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని... పశ్చిమ దేశాల దురాక్రమణకు బదులిచ్చామన్నారు.
తొలి నుంచీ ప్రజల మనసుల్లోనే: క్రిమియాను దేశంలోకి చేరుస్తూ సంతకం చేసిన సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి పుతిన్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 40 నిమిషాలపాటు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రజల మనసుల్లో క్రిమియా తొలి నుంచీ రష్యాలో అంతర్భాగంగా ఉందన్నారు. క్రిమియా రిఫరెండాన్ని గుర్తించబోమన్న పశ్చిమ దేశాల ప్రకటనలను ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా అభివర్ణించారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలను ఆక్రమించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ‘ఉక్రెయిన్ నాటి సోవియట్ యూనియన్ నుంచి అక్ర మ వేర్పాటువాదం ద్వారా ఏర్పడిన రాజ్యం. అయినా మేం ఉక్రెయిన్ విభజనను కోరుకోవట్లేదు. ఆ అవసరం కూడా మాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కొన్ని నెలలపాటు జరిగిన ఆందోళనలన్నీ పశ్చిమ దేశాల ప్రోద్బలంతోనే జరిగాయని పుతిన్ ఆరోపించారు.
ఉక్రెయిన్‌లోని నూతన ప్రభుత్వం అక్రమంగా ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలాక రష్యాను పశ్చిమ దేశాలు మోసం చేశాయని ఆరోపించారు. 18వ శతాబ్దం నుంచి రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్ నేత నికితా కృశ్చెవ్ ఉక్రెయిన్ భూభాగంలోకి బదిలీ చేశారు. ఈ చారిత్రక తప్పిదాన్ని తిరిగి సవరించాల్సిన అవసరం ఉందని నాటి నుం చి రష్యా ప్రజలతోపాటు క్రిమియాలో మెజారిటీ ప్రజలైన రష్యా జాతీయులు కోరుకుంటూ వచ్చారు. అది ఇన్నాళ్లకు నెరవేరినట్లయింది.
ప్రధాని మన్మోహన్‌కు పుతిన్ ఫోన్: క్రిమియాను రష్యాలో చేర్చుకున్న అనంతరం పుతిన్.. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం, క్రిమియా నిర్వహించిన రిఫరెండం తదనంతర పరిస్థితులను వివరించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ దేశాల ఐక్యత, భౌగోళిక సమగ్రతపై భారత వైఖరిని తెలియజేశారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలన్నీ దౌత్య, రాజకీయ మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
రష్యాపై జీ-8 వేటు: గ్రూఫ్ ఆఫ్ ఎయిట్ (జీ-8)లో భాగమైన రష్యాను తమ కూటమి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. క్రిమియాను రష్యా భూభాగంలోకి చేర్చుకున్న వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సును రద్దు చేసుకుంటున్నట్లు మిగిలిన ఏడు దేశాలు ప్రకటించాయి. జీ-8 కూటమిలో ఇప్పటివరకూ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్, బ్రిటన్‌తోపాటు రష్యా కూడా ఉండేది. మరోవైపు అమెరికా, జపాన్‌తోపాటు యూరోపియన్ యూనియన్ రష్యాపై మంగళవారం మరిన్ని ఆంక్షలు విధించింది.
ప్రపంచ శాంతికి ముప్పు: అమెరికా
క్రిమియాను రష్యాలోకి చేర్చుకోవడాన్ని అమెరికా తప్పుబట్టిం ది. ఈ చర్యను ప్రపంచ శాంతికి ముప్పుగా అభివర్ణిస్తూ ‘వైట్‌హౌస్’ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా నిర్ణయం నేపథ్యంలో ఆ దేశం విషయంలో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సిద్ధమయ్యారు. వచ్చే వారం నెదర్లాండ్స్‌లో జరిగే జీ-7 సమావేశానికి రావాల్సిందిగా మిత్ర దేశాలను ఆహ్వానించారు.